‘బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌’ | 15 reasons why a boss is always. right | Sakshi
Sakshi News home page

‘బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌’

Aug 17 2025 9:50 AM | Updated on Aug 17 2025 9:50 AM

15 reasons why a boss is always. right

మీ బాస్‌ను ఎలా మేనేజ్‌ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్‌ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్‌ బ్రిగ్స్‌ టైప్‌ ఇండికేటర్‌) సహాయపడవచ్చు. బాస్‌లు ఎలా పని చేస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అనే అంశాలపై ఆధారపడి ఈ ఇండికేటర్‌ బాస్‌లను కమాండర్, విజనరీ, హార్మనైజర్, స్ట్రాటిజిస్ట్, ఎనలిస్ట్, సపోర్టర్, మ్యావరిక్, ఫ్రీ స్పిరిట్‌ అనే 8 రకాల వ్యక్తులుగా విభజించింది. ఈ ఎనిమిది మందిలో మీ బాస్‌ ఏ టైపు మనిషో కింద ఇచ్చిన ఇండికేటర్‌ ‘కీ’ చెబుతుంది. కనుక ఇండికేటర్‌ను ఫాలో అయిపోండి. ‘బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌’ అంటారు కనుక బాస్‌ తత్త్వానికి అనుగుణంగా మీరు మారండి. ప్రశాంతంగా ఉండండి. కెరీర్‌లో విజయం సాధించండి.

కమాండర్‌లు 
వీళ్లు ఫలితాలనే నమ్ముతారు. పనిలో వేగాన్ని, స్పష్టతను కోరుకుంటారు. సామర్థ్యం, నాయకత్వం, తర్కం వీళ్లలో ముఖ్యమైనవి. వీళ్లకు సమావేశాలు, డెడ్‌లైన్‌లు ముఖ్యం. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఉద్యోగులను వీరు అభిమానిస్తారు. 

ఇలాంటి వారితో పేరాల్లో కాకుండా బుల్లెట్‌ పాయింట్లలో మాట్లాడాలి. కుంటి సాకులు, భావోద్వేగాలు వీళ్లు నచ్చవు. గడుపులోపే చెప్పిన పని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల దగ్గర అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా ఉంటే మీ కెరీర్‌ దెబ్బతిన్నట్లే.  

విజనరీలు 
వీరు శక్తిమంతులు. ఐడియాల పుట్టలు. వినూత్న ఆవిష్కరణల్ని ఇష్ట పడతారు. వీరు వర్క్‌ప్లేస్‌ని శక్తిమంతంగా మార్చేస్తారు. భవిష్యత్తుపై దృష్టి ఉంటుంది. పని ఎలా జరుగుతోందో చూడరు. ఎంత జరిగిందో అడుగుతారు. వీరిని ఆకట్టుకోవడానికి ఫ్రెష్‌ ఆలోచనలు ఉండాలి. 

ఆ ఆలోచనల్ని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగి ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, ఆఫీస్‌ నుండి వెళ్లేటప్పుడు ఆ  ప్రయాణంలో సైతం ఆఫీస్‌ పని చేయవలసి వస్తుంది. రూల్స్‌ మాట్లాడకూడదు. స్ప్రెడ్‌షీట్‌లను కుమ్మరించకూడదు. అంతులేని ఫాలో–అప్‌లతో వారిని ముంచెత్తకూడదు. ఉద్యోగికి సమయస్ఫూర్తి లేకపోవడం వారిని నిరాశపరుస్తుంది.

హార్మౖనైజర్‌లు 
ఉద్యోగులతో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అందర్నీ కలుపుకుని పోతారు. సామరస్యాన్ని కోరుకుంటారు. టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు. మీ పుట్టినరోజును గుర్తుంచుకుంటారు. లేదా మీ కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. హెల్ప్‌ చేసేందుకు రెడీగా ఉంటారు. 

వీరి నాయకత్వం పరస్పర విశ్వాసం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. వీరితో పనిచేయడానికి కమ్యూనికేటివ్‌గా ఉండాలి. టీమ్‌ కల్చర్‌ నిర్మాణానికి మీ సహకారాన్ని కోరుకుంటారు. ఘర్షణాత్మక ధోరణిని అస్సలు ఇష్టపడరు. టీమ్‌ ఒకలా ఆలోచిస్తే మీరు టీమ్‌కు విరుద్ధంగా ఆలోచించటం వీరిలో అసహనం కలిగిస్తుంది.  

స్ట్రాటెజిస్టులు
ఆలోచనాత్మకమైనవారు. లక్ష్యాలే ముఖ్యమైన దార్శనికులు. లోతుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. స్వేచ్ఛ, వ్యూహాత్మకత విలువైనవిగా భావిస్తారు. నాటకీయతను ఇష్టపడరు. అన్నీ తెలుకుని ఉంటారు. పైకి వ్యక్తపరచరు. నాణ్యమైన పనిని ఆశిస్తారు. వీరి దగ్గర భావోద్వేగ ప్రకోపాలు, నిస్సారపు ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉద్యోగికి నష్టాన్ని తెస్తాయి. నిర్మాణాత్మక వాదనలు మాత్రమే వీరి దగ్గర చేయాలి.

ఎనలిస్టులు 
కచ్చితమైనవారు, తార్కికంగా ఉంటారు. ప్రతిదీ వివరంగా తెలుసుకుంటారు. స్పష్టత ముఖ్యం. ఆధారాలు అవసరం. మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని వీరు ఆశిస్తారు. అరకొర పనులను, నిర్ణయాలలో ఊగిసలాటను ద్వేషిస్తారు. డేటా, నిర్మాణం, దృఢమైన తార్కికతతో వీరికి సహాయకారిగా ఉండండి. నాటకీయత వద్దు. ప్రాక్టికల్‌గా ఉండండి. భావోద్వేగ విజ్ఞప్తులతో, అస్పష్టమైన నిబద్ధతలతో లేదా ఒక పనిని దాటవేయడం ద్వారా వారిని నిరాశపరచకండి.

సపోర్టర్‌లు 
నిశ్శబ్దంగా ఉంటారు. నమ్మదగినవారు. సేవా దృక్పథం కలిగినవారు. స్థిరమైన జట్లకు వెన్నెముకగా ఉండాలని కోరుకుంటారు.  స్థిరంగా, శ్రద్ధగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలకు విలువ ఇస్తారు. వీరి దగ్గర మీరు స్థిరంగా, సానుభూతితో, మర్యాదగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అదనపు పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు బాగా రాణిస్తారు. మాటలతో కాకుండా చేతలతో మీరు నమ్మకాన్ని సంపాదించాలి. మీలోని దూకుడు ప్రవర్తన, ఆకస్మిక మార్పులు, టీమ్‌ని విమర్శించటం వంటి పనులతో వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.

మ్యావరిక్‌లు 
చురుగ్గా, వేగంగా, వ్యూహాత్మకంగా ఉంటారు. వీరిది నో–నాన్సెన్‌ ధోరణి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. పనులు పూర్తి చేసే వారిని విలువైనవారిగా భావిస్తారు. తన ఉద్యోగులు సమయాన్ని గౌరవించాలని, ఒత్తిళ్లను స్వీకరించాలని కోరుకుంటారు. మితిమీరిన ప్రణాళికల్ని ఇష్టపడరు. అధిక డాక్యుమెంటేషన్‌ను కూడా లైక్‌ చెయ్యరు. ప్రతిదానికీ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటే మిమ్మల్ని నిష్కర్షగా పక్కనపెట్టేస్తారు.

ఫ్రీ స్పిరిట్‌ కలిగినవారు 
స్వతంత్రమైన, సృజనాత్మకమైన, హృదయపూర్వకమైన గుణాలున్నవారు. వీరికి విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. తన టీమ్‌కు స్వేచ్ఛను ఇస్తారు. మీలో అభిరుచి, చొరవ ఉంటే మిమ్మల్ని టీమ్‌ లీడర్‌గా గుర్తిస్తారు.  వీరితో నిజాయితీగా, దాపరికం లేకుండా ఉండాలి.

మీ బాస్‌ సరే, మీరు ఎలాంటి వారు?
ఇది తెలుసుకోవాలంటే 41 క్యూ.కామ్‌ లేదా 16 పర్సనాలిటీస్‌.కామ్‌లో ఈ ఎం.బి.టి.ఐ. ఆన్‌లైన్‌ పరీక్ష రాయండి. ఎలాంటి బాస్‌ మీకు సరిపడతారో తెలుస్తుంది. ఆల్‌ ది బెస్ట్‌
· సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement