
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్‌లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే..
భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.

ఇక.. పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్‌లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు.

చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది.
మాన్సూన్ ట్రఫ్ అంటే..
మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్‌లో ఈ సీజన్‌లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..
వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
✅ పరిష్కార మార్గాలు
• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది
• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.
• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.
• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.
• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.
దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.