
వెండితెరపై దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అలనాటి నటి బి. సరోజా దేవి (87) అనారోగ్యంతో మరణించారు. వృద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని మల్లేశ్వరంలో తన స్వగృహంలో సోమవారం ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో సినీ ప్రపంచం ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. ఆమె నటించిన సినిమాలు, పాత్రలను గుర్తు చేసుకున్నారు.
అయితే ఆమె చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నేరవేర్చారు. ఆమె కోరిక మేరకు కళ్లను దానం చేశారు. ఆమె కోరుకున్న విధంగా నారాయణ నేత్రాలయకు అందజేశారు. గతంలో నారాయణ నేత్రాలయను సందర్శించినప్పుడు కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారని ఐ బ్యాంక్ అధికారి డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఆమె నేత్రదానానికి నమోదు చేసుకుని దాదాపు ఐదేళ్లు పూర్తయిందని వెల్లడించారు.
అంత్యక్రియలు
సరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తెలుగులో పాతిక వరకూ...
తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్‌తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్‌కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు.