
అప్పారావు, లలిత (ఫైల్)
ఇవి సర్కారు హత్యలే!
రెండు కళ్లు కనిపించక పోవడంతో పదేళ్లుగా పింఛన్ పొందుతున్న భర్త.. వెరిఫికేషన్ కోసం పిలుపుతో తొలగిస్తారని తీవ్ర ఆందోళన..
వైకల్యం 70% నుంచి ఏకంగా 40కి తగ్గింపు
ఇలాగైతే బతికేదెలా అని విష ద్రావణం తాగిన వైనం.. తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్యాయత్నం
టీడీపీ నేతల సూచనతో రంగంలోకి దిగిన సీఐ
కుటుంబ గొడవలతో అంటూ టాపిక్ డైవర్షన్
శ్రీకాకుళం జిల్లాలో ఘటన
సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష కట్టింది. ఏకపక్షంగా లక్షలాది పింఛన్లు తొలగిస్తూ పింఛన్‌దారుల కడుపు కొడుతోంది. పింఛన్ పొందడానికి పూర్తిగా అర్హత ఉన్నప్పటికీ.. అడ్డగోలుగా తొలగింపులకు పూనుకొంది. దీంతో ఇకపై ఎలా బతకాలని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలుకు చెందిన కొల్లి అప్పారావు(45)కు రెండు కళ్లు కనిపించవు.
పదేళ్లుగా దివ్యాంగ పింఛన్ పొందుతున్నాడు. ఇటీవల పింఛన్ రీ వెరిఫికేషన్‌కు రావాలంటూ నోటీసు అందింది. అందులో ఇతనికున్న 70 శాతం వికలాంగత్వాన్ని ఏకంగా 40 శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేశారు. దీంతో తన పింఛన్ ఆపేస్తారని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతో మందికి ఇప్పటికే ఆపేశారని, తనకు కూడా ఆపేస్తే మనం ఎలా బతకాలని భార్య లలిత(42)తో చెప్పుకుని మదనపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు పడేకంటే చనిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చి శనివారం అర్ధరాత్రి దంపతులిద్దరూ పురుగు మందును ఫినాయిల్‌లో కలుపుకుని తాగారు.
కొద్ది సేపటి తర్వాత తల్లిదండ్రులను గమనించిన వారి కుమార్తె దేవి (ఇంటర్ చదువుతోంది) భయపడిపోయింది. తల్లిదండ్రులిద్దరూ విషం తాగి మృతి చెందడంతో ఆమె కూడా అక్కడే మిగిలిపోయిన అదే విషపు ద్రావణం తాగింది. ఆదివారం ఉదయం వీరి ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న బంధువులు లోపలికి వెళ్లి చూశారు. దంపతులిద్దరూ మృతి చెంది ఉండగా, దేవి ప్రాణాలతో ఉండటం గమనించి శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూ కొద్దిగా కోలుకున్న ఆమె.. ఈ మేరకు జరిగిన సంఘటనను మీడియా, బంధువులకు వివరించారు.
సీఐ రాకతో మారిన సీన్
శ్రీకాకుళం రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు రిమ్స్‌కు వచ్చి దేవితో మాట్లాడారు. అధికార పార్టీ నేతల సూచన మేరకు.. తన తల్లిదండ్రులిద్దరూ పింఛన్ ఆపేస్తారనే భయంతో కాకుండా కుటుంబ గొడవల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని దేవితో చెప్పించారు. కాగా, అంత వరకూ ఎక్కడ అర్ధంతరంగా తన పింఛన్ ఆగిపోతుందేమోనని తన తండ్రి నిత్యం ఆలోచించేవారని ఆమె అక్కడ అందరికీ వివరించింది.
శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్‌లు సైతం కుటుంబ వివాదాలే కారణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరిది పేద కుటుంబం. పింఛన్‌పై ఆధార పడి బతుకుతున్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆ విద్యార్థినితో ఇలా చెప్పించడం తగదని చర్చ జరుగుతోంది.
పింఛన్ రాదని గుండె ఆగింది!
అన్నమయ్య జిల్లాలో టైలర్ మనోవేదనతో మృతి
రాయచోటి టౌన్: వచ్చే నెల నుంచి పింఛన్ రాదని ఓ టైలర్ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలివీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెకు చెందిన టైలర్ మహబూబ్ బాషా (50)కు భార్య, నలుగురు పిల్లలు. అతని కుడి కన్నుతో ఏమీ కనపడకపోవడంతో కంటివైద్యుడి సంప్రదించాడు. పరీక్షల అనంతరం ఇక చూపురాదని డాక్టర్ తేల్చిచెప్పారు. దీంతో ఇంటివద్దే ఉంటున్నాడు. వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో ప్రభుత్వ పెన్షన్ వస్తోంది. ఇప్పుడిదే అతనికి ప్రధాన జీవనాధారం.
ఇంతలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి పింఛన్ రాదని మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసు రావడంతో బాషా షాక్‌కు గురయ్యాడు. ఇంటి బాడుగ చెల్లించడంతో పాటు ఇల్లు గడిచేది ఎలాగని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని రాయచోటిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరపతికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
‘అంధత్వం’ కనిపించదా?
ఇద్దరు అంధుల పింఛన్లు తొలగింపు
కౌతాళం: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని గుడికంబాలి గ్రామానికి చెందిన నాగమ్మ, హనుమేష్ పింఛన్లను ప్రభుత్వం అన్యాయంగా తొలగించింది. దీంతో వారు ఆదివారం తమ ఇంటి వద్ద అంధత్వ సరిఫికెట్లను చూపుతూ నిరసన తెలిపారు. తమకు పుట్టినప్పటి నుంచే అంధత్వం ఉందని, ఎంతో ఆసరా అయిన పింఛన్‌ను తొలగిస్తే ఎవరు అన్నం పెడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము రూ.75 నుంచి పింఛన్ అందుకుంటున్నామని, వందశాతం అంధత్వం ఉన్నా పింఛన్ తొలగిస్తే ఎలా బతకాలి అని ప్రశ్నించారు. ఇక గుళ్లు, గోపురాల వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని వాపోయారు. ‘పింఛన్లను ఇప్పించే మార్గం చూడండి సారూ’ అంటూ వేడుకున్నారు.