
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంపై కల్లుగీత కార్మికులు సమరశంఖం పూరించారు. బెల్టుషాపులు తొలగించి.. నీరా కేఫ్‌లు ఏర్పాటు చేసే వరకూ పోరాడాలని కార్మికులు నిర్ణయించారు. బెజవాడలో కల్లుగీత కార్మికులు రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలపై ఆలోచన చేయలేదన్నారు. కల్లుగీత కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలపై నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో 3396 వైన్ షాపులుంటే 75వేల బెల్టు షాపులు పెట్టించారు. స్పిరిట్‌తో తయారు చేసిన కల్తీ మద్యం అమ్మిస్తున్నారు. గోవా, యానాం అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మద్యం వరద పారిస్తున్నారు. మద్యంతో గ్రామాలను ముంచెత్తుతున్నారు. కల్లుగీత వృత్తిని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. ఇంటింటికీ , వీధివీధికి బెల్టుషాపులు పెట్టి కల్లుగీత కార్మికులకు పొమ్మనలేక పొగబెడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మాట తప్పింది.
సెప్టెంబర్ 30 వరకూ దశల వారీగా ఆందోళనలు చేపడతాం. ఆగస్ట్ 22వ తేదీన అన్ని జిల్లాల్లో ఒకేసారి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ఆగస్ట్ 30న అన్ని జిల్లాలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపడతాం. సెప్టెంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమినర్‌ను కలుద్దాం రండి కార్యక్రమం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 10న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తాం. సెప్టెంబర్ 12ప బెల్ట్ షాపులు, కల్లు పాలసీ, ఉపాధిపై జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాం. సెప్టెంబర్ 25న జిల్లాల్లో సమీక్షలు, సభలు నిర్వహిస్తాం’’ అని నరసింహమూర్తి తెలిపారు.
‘‘ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 30న కార్యాచరణ ప్రకటిస్తాం. ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గంలో లెక్కలేనన్ని బెల్టు షాపులున్నాయ్. అక్రమ మద్యం వరదలా పారుతోంది. బెల్టు షాపులు పెడితే తోలు ఒలుస్తామని ముఖ్యమంత్రి , ఎక్సైజ్ మంత్రి మాటలు చెప్పారు. ఇంతవరకూ ఎవరి తోలూ ఒలవలేదు. ఇంకా బెల్టు షాపులు పెరుగుతూ ఉన్నాయి
కల్లుగీత కార్మికులకు బెల్ట్ షాపులు జీవన్మరణ సమస్యగా మారింది. పోరాటం ఆగదు.. సమరశంఖం పూరిస్తాం... ఉవ్వెత్తున ఉద్యమిస్తాం. చెట్టుమీద నుంచి పడిపోయిన కల్లుగీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా చంద్రబాబు రద్దు చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. కల్లుగీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. తెలంగాణ మాదిరి నీరా పరిశ్రమలు పెట్టాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.