
తాడిపత్రి టౌన్: జేసీ కుటుంబం తమ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులనే కాకుండా సొంత పార్టీ నాయకులపై సైతం కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశ మైంది. తాజాగా సోమవారం తాడిపత్రిలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీకే చెందిన కాకర్ల బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించి సొంత పార్టీ నాయకులే విస్తుపోయేలా చేశారు. సీఎం సామాజికవర్గానికి చెందిన కాకర్ల రంగనాథ్, జయుడు, రంగనాయకులు గ్రూపు, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అందుకే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానించడం గమనార్హం.
గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో జేసీ, కాకర్ల బ్రదర్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేడుకల్లో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకొని రణరంగం సృష్టించారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా ఇరువర్గాలు ఒకరిని మించి మరొకరు బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. కాకర్ల బ్రదర్స్ స్టిక్కర్ కనిపిస్తే వాహనాలను ధ్వంసం చేస్తామని అప్పట్లో టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ జిల్లా, రాష్ట్ర నాయకుల ముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం.
అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జేసీ తనకు తానుగా కాకర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి చర్చకు తెరతీశారు. కాగా, కాకర్ల రంగనాథ్ సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు మంత్రి నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్న నేపథ్యంలో తాడిపత్రి టీడీపీలో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
