సాక్షి,విజయవాడ: అక్రమ మద్యం కేసులో అరెస్టై 226 రోజుల పాటు జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. చెవిరెడ్డికి పార్టీ నేతలు ఆయనకు పూలమాలలు వేసి, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా ఆహ్వానించారు.
జైలు విడుదల అనంతరం, చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు జైలు జీవితం తప్పదు. గతంలో చంద్రబాబు నాపై 72 కేసులు పెట్టారు. చంద్రగిరి నుంచి ఎదిగాను కాబట్టే చంద్రబాబు వేధిస్తున్నారు. గతంలో నన్ను చాలా అవమానకరంగా అరెస్టు చేశారు. కళ్లకు గంతలు కొట్టి నన్ను పోలీసులతో కొట్టించారు. చంద్రబాబు ఇప్పుడు నన్ను ఎనిమిది నెలల పాటు జైల్లో పెట్టారు. చంద్రబాబు పుట్టిన గ్రామంలో నేను పుట్టడం నా తప్పా.

చంద్రబాబు సొంత ఊరి నుంచి నా కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా కుమారులపై కేసులు పెట్టారు. మా కుటుంబ సభ్యులంతా చంద్రబాబు బాధితులే. ఫైరవీలతో కాదు.. పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చా.1988 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. చంద్రబాబు ఎన్నికేసులు పెట్టిన బయపడను. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం వైఎస్సార్ నుంచి నేర్చుకున్నా. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటా. నేను భయపడను. అన్నింటికి కాలమే సమాధానం చెబుతోంది’ అని వ్యాఖ్యానించారు.
మద్యం కేసులో గతేడాది జూన్ 17న చెవిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. అక్రమ కేసులు నమోదు చేయడంతో 226 జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సిట్ అభియోగాలు
డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం.


