
జయచంద్రారెడ్డికి బీ ఫారం ఇస్తున్న చంద్రబాబు పక్కనే ఉన్న నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దనరావు(ఫైల్)
నకిలీ మద్యం కేసులో బాబు సర్కారును సూటిగా నిలదీస్తున్న పరిశీలకులు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం మాఫియా కేసును టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే కుతంత్రాలకు పదును పెడుతోందన్నది పక్కాగా స్పష్టమవుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావు మాట్లాడిన వీడియో మీడియాకు విడుదల కావడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అంతే కాదు.. పెద్దల పాత్ర, దర్యాప్తు పేరిట పోలీసుల అక్రమాలను బయటపెట్టింది. జనార్దన్‌రావు టీడీపీ నేతలకే అత్యంత సన్నిహితుడని మరోసారి తేటతెల్లమైంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తూ రాజకీయ పరిశీలకులు ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు ఇవీ...

1 జనార్దన్‌రావు చంద్రబాబుకు అంతటి సన్నిహితుడే కదా...! 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్ధన్‌రావు అక్కడే ఉన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్ధన్‌రావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతం? అంటే ఆయన చంద్రబాబు, జయచంద్రారెడ్డిలకే సన్నిహితుడనే కదా. మరి ఆయన వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేశ్‌కు సన్నిహితుడు అన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథే కదా!
2 నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్‌రావు ఓ కార్పొరేట్ పారిశ్రామికవేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన ధీమా వెనుక దన్ను ఎవరు? కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారు?
3 నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న జనార్ధన్‌రావు హడావుడిగా ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్నారు? వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టు కథలు వల్లె వేయాలన్న ముఖ్యనేత ఆదేశంతోనే ఆయన వచ్చారన్నది సుస్పష్టం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేశ్‌కు ఆయన నిజంగానే సన్నిహితుడే అయితే ఇంత హడావుడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చేయలేరు కదా? అంటే జనార్ధన్‌రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కథ అన్నది స్పష్టమవుతోంది.
4 జనార్దన్ రావు తన మొబైల్ ఫోన్‌ను విదేశాల్లో వదిలి రావడం ఏమిటి..? అలా చెప్పమని ఆయన్ను ఆదేశించింది ఎవరు.? ఆ ఫోన్ గుట్టు విప్పితే బయటపడే ప్రభుత్వ పెద్దల జాతకాలు ఏమిటి..? ఇవీ కదా ఈ కేసులో కీలక ప్రశ్నలు. వాటిని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఆయన ఫోన్ వదిలి వచ్చారన్నది తేటతెల్లమవుతోంది కదా.
5 ములకల చెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయలేదు? ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా? కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేంతవరకు విదేశాల నుంచి రావద్దని ఆయన్ను ఆదేశించిన ముఖ్యనేత ఎవరు?

6 నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం దందా రాష్ట్రం అంతటా విస్తరించిందని ఒప్పుకున్నట్టే కదా...?
7 మొదట పోలీసులు, తరువాత జైలు అధికారుల అదుపులో ఉన్న జనార్ధన్‌రావు అసలు ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడారు? ఆయన మాట్లాడిన వీడియో అసలు ఎక్కడ షూట్ చేశారు? ఎవరు షూట్ చేశారు? పక్కనుంచి ఆయనకు డైలాగులు ఎవరు అందించారు? ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అంటే.. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోంది కదా. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్‌లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిది?
8 జనార్ధన్‌రావు మాట్లాడిన వీడియో సోమవారం విడుదల కాగా.. అందులోని విషయాలపై ముందుగానే అంటే ఆదివారమే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు? అంటే ఆ వీడియో విడుదల కానుందని...అందులో ఏం మాట్లాడారన్న సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా? వైఎస్సార్‌సీపీ నేతలకు ప్రమేయం ఉందని చంద్రబాబు ఆదివారం చెప్పిన విషయాలే... సోమవారం విడుదల అయిన జనార్దన్ రావు వీడియోలోనూ ఉండటం వెనుక లోగుట్టు ఏమిటి?