చంద్రబాబు కమీషన్ల దందాపై మల్లాది విష్ణు ఆగ్రహం | malladi vishnu slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కమీషన్ల దందాపై మల్లాది విష్ణు ఆగ్రహం

Oct 13 2025 7:47 PM | Updated on Oct 13 2025 8:37 PM

malladi vishnu slams chandrababu naidu

సాక్షి,తాడేపల్లి: దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత భారీ వ్యయాలతో అమరావతిలో ప్రభుత్వ భవనాలను నిర్మించడం వెనుక సీఎం చంద్రబాబు దండుకుంటున్న కమీషన్ల దందా దాగి ఉందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రారంభించిన సీఆర్‌డీఏ భవన నిర్మాణ వ్యయాన్ని చూస్తేనే ఎంత భారీ అవినీతి దీనిలో ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏకంగా చదరపు అడుగు రూ.11,0002.64 చొప్పున దాదాపు రూ.338.14 కోట్లతో సీఆర్‌డీఏ భవనాన్ని నిర్మించారని, దేశంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా ఉన్న బెంగుళూరు, ముంబై వంటి చోట్ల, స్టార్ హోటళ్ళే చదరపు అడుగు గరిష్టంగా రూ.4500లకే నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. అంచనాలను పెంచడం, అందులో తమ వంతు ముడుపులను అందుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...

సీఆర్‌డీఏ నూతన భవనం గురించి చెప్పుకోవాలంటే... అప్పుచేసి పప్పు కూడు, జనానికి క్షవరం.  రెట్టింపునకు మించి నిర్మాణ వ్యయం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారేందుకు ఈ సీఆర్‌డీఏ భవనమే పెద్ద ఉదాహరణ. తొలిగా హెచ్‌ఓడి పేరుతో పురపాలక, పట్టణాభివృద్ది శాఖలు ఈ భవనం నుంచే పనిచేస్తాయని చెబుతున్నారు. సీఆర్డీఏ భవనంలో ఏ విభాగాలు పనిచేస్తాయి, అందులో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రస్తుతం వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారంటే సరైన సమాధానం లేదు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే సామెతను తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజల సొమ్ముతో అవసరానికి మంచిన సామర్థ్యంతో, రెట్టింపు అంచనాలతో భారీ భవనాలను నిర్మించి, తమ ఘనతగా చాటుకోవాలని చూస్తోంది. అనుత్పాదక వ్యయంగా ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా దీని నిర్వహణ కోసం అత్యధిక వ్యయాన్ని భరించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాల నిర్వహణకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలియదా? దీనివల్ల ప్రభుత్వంపై భారం పడదా?

చంద్రబాబు కమీషన్ల దందా
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు దీనిని అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. అందుకే దేశంలో భవనాలు, రోడ్ల కోసం ఎక్కడా లేని విధంగా భారీ వ్యయాన్ని కేటాయిస్తున్నారు. అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారు. అప్పులు చేసి రాజధాని పేరుతో భవనాలు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రుణభారాన్ని ప్రజల నెత్తిమీద రుద్దుతున్నారు. ప్రతిసారీ తాను గొప్ప విజనరీనీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన కమీషన్లను పెంచుకోవడానికే, ఈ తరహాలో అంచనాలను పెంచి భారీ నిర్మాణాలను చేపడుతున్నారు.

2016లో ఇదే తరహాలో వెలగపూడిలో రూ.1150 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కలిక సచివాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు శాశ్వత సచివాలయం, హెచ్‌ఓడి కార్యాలయాల కోసం 52,90,426 చదరపు అడుగులతో నిర్మాణాలకు సిద్దమయ్యారు. ఈ భారీ భవనాలు, టవర్స్‌ కోసం రూ. 4688.82 కోట్లు ఖర్చు చేస్తూ, ఇప్పటికే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. సచివాలయంలో ఎక్కువలో ఎక్కువ మూడు వేల మంది పనిచేస్తుంటారు. వారి కోసం ఇన్ని లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు అవసరమా? రాజధాని నిర్మాణం ముసుగులో సీఎం చంద్రబాబు చేస్తున్న దందా ఇది అని అర్థమవుతోంది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం నిధులు లేవా?
ఈ రాష్ట్రంలో పేద విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎంగా వైఎస్ జగన్ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. వాటిని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు లేవంటూ, వాటిని ప్రైవేటు వారికి అప్పగించేందుకు ఈ కూటమి ప్రభుత్వం తెగబడింది. ఒకవైపు రాజధాని ప్రాంతంలో విలాసవంతమైన భవనాలను వందల కోట్లతో అప్పులు చేసి మరీ నిర్మిస్తున్న ఈ ప్రభుత్వానికి, పేదలకు ఉపయోగపడే వైద్య కళాశాలలకు, దానికి అనుబంధంగా నిర్మించాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం కనిపించడం లేదా? వాటికి కేటాయించడానికి మాత్రం సీఎం చంద్రబాబు వద్ద నిధులు లేవా? అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు.

మరోవైపు ప్రభుత్వ వైద్యరంగాన్ని, మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే మొదటిదశలో భూములు ఇచ్చిన రైతులు తమకు ప్లాట్లు ఇవ్వలేదని, కౌలు సొమ్ములు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో రెండోదశ భూసేకరణ కోసం ప్రభుత్వం సిద్దమవ్వడం, భారీ అంచనాలతో నిర్మాణాలకు సిద్దమవ్వడం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటీ? ఒకవైపు రైతులు రాజధానిలో తమకు ప్లాట్లు ఇవ్వలేదని ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు భారీ వ్యయాలతో, విలాసవంతమైన నిర్మాణాలు చేపడతామనే ముసుగులో భారీగా కమీషన్లు దండుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement