
సాక్షి, తాడేపల్లి: పండుగలను కూడా రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబుకు అలవాటంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కొన్నిసార్లు హిందూత్వవాదిగా, కొన్నిసార్లు లౌకికవాదిగా రంగులు మార్చుతారని.. పీఠాలకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆయన దుయ్యబట్టారు.
‘‘తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చేసి, తాను హిందూవాదిగా ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు హయాంలోనే తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోయారు.. అలాంటి చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని గట్టిగా నమ్మిన మనిషి వైఎస్ జగన్.. ఆయన వినాయకుని పూజ చేస్తే చంద్రబాబు భయపడి పోయారు. ఆగమేఘాల మీద విజయవాడలో వినాయకుని దర్శనానికి వెళ్లారు’’ అని విష్ణు పేర్కొన్నారు.
..అప్పటికప్పుడు షెడ్యూల్ పెట్టుకుని డూండీ వినాయకుని దర్శనానికి ఎందుకు వెళ్లారో చెప్పాలి. దేవుడి చెంత కూడా రాజకీయ ప్రసంగాలు చేసి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. అందునా విష ప్రచారం చేయటానికి నోరు ఎలా వచ్చింది?. జగన్ హయాంలో వినాయకుని మంటపాల అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్ ని తెచ్చాం. మా విధానాలనే చంద్రబాబు అమలు చేస్తూ మాపైనే విమర్శలు చేస్తున్నారు. రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల మోత ప్రజల మీద వేసి, వినాయక పందిళ్లకు ఫ్రీగా కరెంటు ఇచ్చామంటున్నారు.
..అసలు ఎన్ని పందిళ్లకు కరెంటు ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. చంద్రబాబు వెళ్లిన వినాయక మంటపం నిర్వాహకులు ప్రజల నుండి ఎంత విరాళాలు వసూలు చేశారో చెప్పాలి. 2019-24 మధ్య జగన్ హయాంలో కాణిపాకం ఆలయాన్ని పునర్నిర్మించారు. బంగారు రథాన్ని కూడా జగన్ హయాంలోనే చేశారు. చంద్రబాబు హయాంలో తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగాయి. భక్తులు మరణించారు.
..తిరుపతిలో జగన్ వకుళమాత ఆలయాన్ని నిర్మాణం చేశారు. హిందూమతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఎన్నో పీఠాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు ఆ పీఠాల భూములను లాక్కున్నారు. విశాఖపట్నంలో ఊరు, పేరులేని కంపెనీలకు వేల ఎకారలను ఇస్తూ, శారదా పీఠానికి జగన్ ఇచ్చిన భూములను లాక్కున్నారు. ఇదేనా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.