
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్‌ను మెసేజ్‌లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు
..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు
..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు.
స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని వెంకట గోపి హెచ్చరించారు.