
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి 42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్‌కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.
ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్‌తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు.
పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..
వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.
భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఉంది.

కోర్టుని నమ్మించి..
వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్‌నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి.