
సాక్షి, తాడేపల్లి: విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఏడాది గడిచినా నష్ట పరిహారం ఇవ్వకుండా వంచించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీశారన్న వెలంపల్లి, పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు, ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేవలం సీఆర్డీఏకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
సంబరాలు దేనికి చంద్రబాబూ..?
చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన విజయవాడ వాసులు ఏడాది గడిచినా పరిహారం అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.కానీ ఇవన్నీ ఏమీ పట్టనట్టు తాను తొలిసారి సీఎం అయ్యి 30 ఏళ్లు పూర్తయిపోయిందని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు.
గతేడాది బుడమేరు వరదల కారణంగా విజయవాడ నీట మునిగినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రులు నగరంలో తిరిగి ఫొటోలకు ఫోజులిచ్చి హామీలిచ్చి వెళ్లిపోయారే గానీ ఏడాది పూర్తయినా బాధితులకు పరిహారం అందలేదన్న సంగతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ బాధితుల కష్టాలు కూటమి ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదు.
సీఎం అయ్యి 30 ఏళ్లయిందని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారో చెప్పాలి. గతేడాది వరదలొచ్చినప్పుడు బుడమేరు ఆధునికీకరణ పనులు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. రాత్రింబవళ్లు అక్కడే నిద్ర చేసి వరద ముంపు సమస్యను పరిష్కరించానని ప్రచారం చేసుకున్న మంత్రి రామానాయుడు, బుడమేరు ఆధునికీకరణ పనులపై ఆ తర్వాత కొన్నాళ్లు హడావుడి చేసి వదిలేశారు. బుడమేరు ప్రక్షాళన ఏమైందో ఆయన సమాధానం చెప్పాలి.

రూ.6800 కోట్ల నష్టం జరిగితే.. ఏ మేరకు సాయం చేశారు..?
వరదల కారణంగా నష్టపోయిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడామని, ఇంట్లో పాడైపోయిన ఎలక్రిక్ వస్తువుల కోసం ఎలక్ట్రిసిటీ కంపెనీలను సంప్రదించామని వారితో మీటింగ్‌లు పెట్టిన సీఎం చంద్రబాబు.. బాధితులకు మాత్రం పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. స్కూటర్లు, ఆటోలు కొత్తవి ఇవ్వలేదు సరికదా కనీసం ఉచితంగా రిపేర్ కూడా చేయలేదు. ఇంట్లో బురద కడగడానికి ప్రభుత్వమే మనుషులను పంపిస్తుందని చెప్పినా సొంతంగానే ఎవరికి వారే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సర్వే పేరుతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో బాధితులను వదిలేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నవారు డోర్ లాక్ అని రాసుకుని వెళ్లారు. మీ ఇళ్లలో వారం రోజులు నీళ్లు నిలవలేదు కాబట్టి సాయం ఇవ్వలేమని అడ్డగోలు కండిషన్లు పెట్టి వరద బాధితులను ఈ ప్రభుత్వం హేళన చేసింది.
ప్రచారంలో మాత్రం డ్రోన్లతో ఇంటింటికీ సాయం అందించామని చెప్పుకున్నారు. సుమారు 2.68 లక్షల కుటుంబాలను వరద ముంచేసిందని దాదాపు రూ.6800 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపారు. వరద బాధితుల సహాయార్థం దేశవిదేశాల నుంచి దాతలు స్పందించి దాదాపు రూ. 400 కోట్లకుపైగా విరాళాలు అందజేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా మాత్రమే పరిహారం అందించి చేతులు దులిపేసుకుంది. మరీ దారుణంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, పెరుగన్నం ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపించి కూటమి ఎమ్మెల్యే భారీగా దొచుకుతున్నారు. కుమ్మరిపాలెంలో వరద సాయం కోసం మహిళలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తే దారుణంగా పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.
విజయవాడను గాలికొదిలేశారు:
పేరుకేమో అమరావతి రాజధాని, కానీ ఎక్కడా కాలవల్లో కనీసం పూడికలు తీయడం లేదు. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని పూర్తిగా దెబ్బతీశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక్క సీఆర్డీఏకి మాత్రమే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థల సమస్యల మీద ఆయన ఇంతవరకు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. విజయవాడ అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. చంద్రబాబు పేరు చెబితే లిక్కర్ షాపులు తప్ప ఏ ఒక్క పథకం కూడా గుర్తురాదు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందని వినాయకుడి మండపంలో నిలబడి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. విజయవాడ వరదల పాపం చంద్రబాబుదే. ఆయన నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు వరదలతో విజయవాడ మునిగిపోయింది. తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలను ముంచేశాడు. ఇప్పటికైనా బుడమేరు వాగును ప్రక్షాళన చేసి ఆధునికీకరణ పనులను తక్షణం పూర్తి చేయాలి. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే బాధితుల పక్షాన నిలబడి వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం.