
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు భూబకాసురుడుగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్‌క్లబ్‌ల ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూసమాజం సహించదని హెచ్చరించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో, ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న ఈ దురాగతాన్ని న్యాయపోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, విలువైన ఆలయ భూములను పద్ధతి ప్రకారం తమ వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్ క్లబ్‌లకు ఎలా కేటాయిస్తారు? గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శిధిలావస్థకు చేరిన ఈ ఈ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షలు కేటాయించి వైయస్ జగన్ జీర్ణోద్దరణ చేశారు. నేడు కూటమి ప్రభుత్వం మాత్రం విలువైన ఆ ఆలయ భూములు కబ్జా చేసేందుకు కలెక్టర్‌ని అడ్డం పెట్టుకుని పావులు కదుపుతోంది. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కౌలుకిచ్చిన ఈ భూముల్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో రాత్రికిరాత్రే కంకర, మట్టి, ఇసుక తరలించి లెవలింగ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా చేసిన ఈ భూకేటాయింపులను హిందూ ధర్మపరిరక్షణ సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఒక్క గజం భూమి కూడా కబ్జా కానివ్వం. ఈ భూముల వ్యవహారంపై అవసరమైతే న్యాయస్థానాల్లోనే వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.
సనాతన ధర్మ పరిరక్షకులు దీనిపై స్పందించాలి:
మచిలీపట్నంలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన సుమారు 40 ఎకరాల భూమిని దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగా 35 ఎకరాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పేరిట, మరో 5 ఎకరాలను గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు పేరిట భారత్ గోల్ఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కేటాయించాలని సూచిస్తూ స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు అండతో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో కలెక్టరే ఈ భూపందేరం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. కూటమి నాయకులు ఆలయ భూములను కాజేస్తున్నారని మేం చేసే ఆరోపణలు కాదు.. టీడీపీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా 'అయ్యో సామీ' పేరిట కథనం ప్రచురించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం దేవాదాయ శాఖ భూములిచ్చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకునే బీజేపీ నాయకులు, ఆలయ భూములను అప్పనంగా కట్టబెట్టేస్తుంటే చోద్యం చూడటం ఆశ్చర్యకరమైన విషయం. దీనికి బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురంధీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమాధానం చెప్పాలి. రిక్రియేషన్ ముసుగులో పేకాట ఆడుకోవడం కోసం భూములు కట్టబెట్టేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ఎన్నికల్లో ఓట్ల కోసమే దేవుడి పేరు వాడుకుంటారా?
ఆలయ అభివృద్ధికి రూ.1.80 కోట్లు కేటాయించిన వైఎస్ జగన్:
కలెక్టర్ లేఖ రాసిందే తడవుగా రాత్రికి రాత్రే ఈ ఆలయ భూములను చదును చేసేశారు. ఇప్పటికే ఆ భూములను వేలం ద్వారా పలువురు రైతులు కౌలుకు పొందారు. బొర్రా రవికి ఏడెకరాలు, అబ్బూరి శ్రీనివాసరావు, అనుముల రామారావుకి, ఈపూరు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తులకు వ్యవసాయం చేసుకోవడానికి మే 15న కౌలుకు అనుమతులు ఇచ్చారు. వారి కౌలు గడువు ముగియక ముందే ఆఘమేఘాల మీద ఈ భూములను స్వాధీనం చేసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గోల్ప్‌కోర్ట్‌లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. 2017 లోనే ఈ ఆలయ భూములు కాజేయాలని టీడీపీ నాయకులు స్కెచ్ వేసుకున్నారు. అందులో భాగంగానే శ్రీ వేకంటేశ్వరస్వామి ఆలయాన్ని విజయవాడ దుర్గగుడికి అడాప్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఈ దోపిడీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత నాటి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం పరిధి నుంచి తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ భూములను తీసుకొచ్చారు. పాడుపడిపోయి, దూపదీప నైవేద్యాలకే కరువైన ఈ గుడికి నాటి సీఎం వైయస్ జగన్ రూ.1.80 కోట్లు కేటాయించి చినజీయర్ స్వామితో అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారు. ఒకపక్క మేం హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా ఆలయాల అభివృద్దికి నిధులు కేటాయిస్తుంటే, కూటమి నాయకులు మాత్రం ఆలయాల పేరిట ఉన్న విలువైన భూములపై కన్నేసి దోచుకునే పనిలో పడ్డారు.

ఆలయ భూముల పరిరక్షణకు న్యాయపోరాటం:
ఏదైనా భూకేటాయింపులు నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తామంటే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. బీజేపీ, వీహెచ్‌పీ మాతో కలిసొచ్చినా రాకోపోయినా పర్లేదు.. భూకేటాయింపులు ఆగేదాకా పోరాడతాం. జరగని తప్పులు జరిగినట్టుగా చూపించడానికి దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్, తాను భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చూస్తూ కూర్చోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై వైయస్సార్సీపీ తరఫున న్యాయపరంగా పోరాడతాం. భూమిని చదును చేయడానికి ఇసుక, కంకర, మట్టి తరలించిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఒక్క గజం స్థలం అన్యాక్రాంతమైనా ఊరుకునేది లేదు. పనులను అడ్డుకుంటున్న దేవాదాయ శాఖ అధికారులను ఎంపీ కేసినేని చిన్ని మనషులు బెదిరిస్తున్నారు. పోలీసులు దీనిపై తక్షణం కలగజేసుకుని చదును చేసే పనులు ఇక్కడితే ఆపేయించాలి.