
గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలపై సీఎం చంద్రబాబు ఆదేశం
ఆ స్థలాలను ఎంఎస్‌ఎంఈలు, పరిశ్రమలకు కేటాయించాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్ద పెద్ద లే–అవుట్లలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోకపోతే ఆ స్థలాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్మించిన లే–అవుట్లలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకోని లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ఆ స్థలాలను ఎంఎస్‌ఎంఈలు, పరిశ్రమలకు కేటాయించాలని ఆయన ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంబించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించగానే పొజిషన్ సర్టీఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు.
సాగుకు నీళ్లిస్తే వరి వేసేస్తున్నారు
వ్యవసాయానికి పుష్కలంగా నీళ్లు ఇవ్వడంతో రైతులందరూ వరి మాత్రమే సాగు చేస్తున్నారని తద్వారా మార్కెట్ ఉండట్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వరికి బదులు డ్రై క్రాప్స్(హార్టీకల్చర్) సాగు చేయాలని సూచించారు. ఏడాదికి రెండు పంటల్లో తప్పనిసరైతే ఒకటి వరి వేసుకుని, మరొక ప్రత్యామ్నాయ పంటను సాగు చేయాలన్నారు. ఇకపై మధ్య, చిన్న తరహా ఇరిగేషన్ వ్యవస్థల్లోనూ నీటిని నిల్వ చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే ఎత్తిపోతల పథకాన్ని సైతం మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్లు చెక్ డ్యామ్స్ రిపేర్లపై దృష్టి పెట్టాలని, అవుట్ సోర్సింగ్ ద్వారా పనులు చేయించాలన్నారు.
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి..
పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికే పూర్తి చేసేలా పనులు వేగవంతం చేస్తున్నట్టు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ చెప్పారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సీఎం ఆదేశాలతో పుష్కరాల నాటికే పోలవరం పనులు పూర్తి చేస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తవడానికి డిసెంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. కానీ, ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ముందుగా పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏలూరు, అల్లూరి జిల్లాల కలెక్టర్లు 7,000 ఎకరాల భూమిని సేకరించడంపై దృష్టి పెట్టాలని కోరారు.
తురకపాలెంలో ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాల కట్టడిలో ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయిందని వైద్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అన్నారు. అనారోగ్య సమస్యలతో 4 నెలల వ్యవధిలో ఏకంగా 29 మంది ఒకే గ్రామంలో మరణిస్తే కేవలం ఒక్క మరణమే అధికారికంగా నమోదైందన్నారు. విజయవాడ రాజరాజేశ్వరీపేట డయేరియా ఘటనలోనూ అదే దుస్థితి నెలకొందన్నారు. డయేరియా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం గుర్తించలేకపోయిందని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తల ద్వారా సమస్యను గుర్తించాల్సి వచ్చిందన్నారు. దోమల నిర్మూలనకు డ్రోన్‌ల ద్వారా పిచికారి చేస్తుంటే నాలుగు రెట్లు ఖర్చు ఎక్కువ అవుతోందన్నారు. ఎకరం విస్తీర్ణంలో ఒక రౌండ్ పిచికారీకి రూ.3,255 చొప్పున వెచ్చించాల్సి వస్తోందన్నారు.