
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్‌మోహన్‌రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.
మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్‌మోహన్‌రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.
హైదరాబాద్‌కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్‌లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది.