
'కూలీ' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున.. తొలిసారి విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. రెండు నెలల క్రితం 'కుబేర'లో వైవిధ్యమైన సహాయ పాత్రలో కనిపించి మెప్పించాడు. అయితే ఇప్పుడంటే నాగ్ వెంటపడి దర్శకులు సినిమాలు తీస్తున్నారు. కానీ స్వయంగా నాగార్జున.. డైరెక్టర్ మణిరత్నం వెంటపడి ఓ సినిమా చేశారని మీలో ఎందరికీ తెలుసు. అవును ఆ సంగతులు నాగ్ ఇప్పుడు బయటపెట్టాడు.
జగపతిబాబు హోస్ట్‌గా ఓ టాక్ షో ప్రారంభమైంది. అందులో నాగార్జున తొలి గెస్ట్‌గా వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో సంగతులు పంచుకున్న నాగ్.. తన యాక్టింగ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మణిరత్నం వెంటపడి 'గీతాంజలి' సినిమా చేసిన అనుభవం గురించి బయటపెట్టారు.
(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)
'నేను చేసిన ప్రారంభ సినిమాలని నాగేశ్వరరావు అబ్బాయి అనే ఉద్దేశంతోనే ప్రేక్షకులు చూశారు. కొందరికి నా యాక్టింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదు. తర్వాత కూడా ఆరేడు మూవీస్ చేశా. అలా 'మజ్ను' నాకు బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ చిత్రాల్లో అయితే 'ఆఖరి పోరాటం' హిట్ అయింది. అయితే అందులో నేను బొమ్మలా ఉన్నానంతే. డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్ల మూవీ సక్సెస్ అయింది'
'మణిరత్నం తీసిన 'మౌనరాగం' సినిమా నాకు బాగా నచ్చింది. దీంతో ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని అనుకున్నాను. ఆయన వాకింగ్‌కి వెళ్లే పార్క్ వివరాలు తెలుసుకుని, దాదాపు నెలరోజులు ఆయన వెంటపడ్డాను. పది నిమిషాలు కలిసి నడిచిన తర్వాత ఆయన టెన్నిస్ ఆడేందుకు వెళ్లిపోయారు. చివరకు ఎలాగోలా ఒప్పించాను. అలా 'గీతాంజలి' మూవీ వచ్చింది. దాన్ని తమిళంలోనే తీయాలనుకున్నారు. కానీ తెలుగు మార్కెట్ కూడా పెంచుకోండి అని సలహా ఇవ్వడంతో నాతో సినిమాకి ఒప్పుకొన్నారు. అనుకున్నట్లే హిట్ అయింది' అని నాగార్జున చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ)