బాల్యపు గాయాలే భవిష్యత్‌ నిర్ణేతలు! | The impact of childhood trauma on children's wellbeing | Sakshi
Sakshi News home page

బాల్యపు గాయాలే భవిష్యత్‌ నిర్ణేతలు!

Aug 17 2025 10:01 AM | Updated on Aug 17 2025 10:02 AM

The impact of childhood trauma on children's wellbeing

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా తపన పడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కోచింగ్‌... ఇలా చేయాల్సిన దానికి మించి చేస్తారు. మార్కులు, ర్యాంకులతో పిల్లల విజయాన్ని కొలుస్తారు. కాని, మీ బిడ్డ జీవితంలో అతిపెద్ద విజయం ఎగ్జామ్‌ హాల్లో కాదు, తన మనసులో జరుగుతుంది. ప్రతి బిడ్డ మనసులో ఒక రిపోర్ట్‌ కార్డ్‌ ఉంటుంది. అది మార్కులకు సంబంధించినది కాదు, భావాలకు, అనుభవాలకు సంబంధించినది. ఆ రిపోర్ట్‌ కార్డ్‌లో భయం, నిర్లక్ష్యం, అవమానం లాంటివి ఉంటే, అవే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వీటినే సైకాలజీలో ‘కనిపించని గాయాలు’ అని పిలుస్తారు.

గత ఏడాది ఒక టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్‌ ఎగ్జామ్‌ ఫోబియాతో కౌన్సెలింగ్‌ కోసం వచ్చాడు. ఆ స్టూడెంట్‌తో మాట్లాడాక తెలిసింది అతని భయానికి కారణం సబ్జెక్ట్‌ కాదు, 90 శాతం కంటే తక్కువ మార్కులు వస్తే ‘నువ్వెందుకూ పనికిరావు’ అని తండ్రి తిట్టడమని. అందుకే అతనితో పాటు తండ్రికి కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చాను. మూడు నెలల్లో ఫోబియా మాయమైంది. 10 జీపీఏతో పదోతరగతి పాసయ్యాడు. 

పరిశోధనలేం చెబుతున్నాయి?
అనుభవాలను బట్టి మెదడు వైర్‌ అవుతుంది. సురక్షితమైన, ప్రేమతో కూడిన వాతావరణంలో ఫోకస్, డెసిషన్‌ మేకింగ్‌కు కారణమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ బాగా అభివృద్ధి చెందుతుంది. నిరంతరం భయంతో ఉంటే భయాన్ని నియంత్రించే అమిగ్డాలా హైపర్‌ యాక్టివ్‌ అవుతుంది. 

బాల్యంలో అవమానం, నిర్లక్ష్యం, శారీరక లేదా భావోద్వేగ దౌర్జన్యం ఎదుర్కొన్న పిల్లలు నాలుగు రెట్లు ఎక్కువగా డిప్రెషన్, ఆందోళనకు గురవుతారని 17 వేల మంది పిల్లలపై జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అలాంటి పిల్లలు చదువులో వెనుక బడతారు. పెరిగి పెద్దయ్యాక, కెరీర్‌లో స్థిరత్వం లేక ఇబ్బందులు పడతారు. సంబంధాలలో సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు.

బాల్యంలో ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉన్న పిల్లలకే జీవితంలో, కెరీర్‌లో సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువని హార్వర్డ్‌ స్టడీలో కూడా వెల్లడైంది. ఫార్చ్యూన్‌ 500 సీఈఓలలో 70 శాతం మందికి సురక్షితమైన బాల్యం ఉండటమే ఇందుకు పెద్ద ఉదాహరణ. 

కొనసాగే గురుతులు...

బాల్యంలో మనసుకైన గాయాలు కనిపించవు. కాని, వాటి ప్యాటర్న్‌ పెద్దయ్యాక కూడా కనిపిస్తుంది.

బాల్యంలో ప్రేమ షరతులతో కూడినదైతే పెద్దయ్యాక అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. 

ఓటమిని అంగీకరించడం నేర్పించకపోతే, టాపర్‌ అయినా ఎగ్జామ్‌ ఫెయిల్‌ అవుతాననే భయంతోనే బ్రతికేస్తుంటాడు. 

‘నువ్వెందుకూ పనికిరావు’ అనే మాటల మధ్య పెరిగిన బిడ్డకు ఎంత టాలెంట్‌ ఉన్నా పెద్ద అవకాశాలను తప్పించుకునే వ్యక్తిగా మారతాడు. 

7 స్టెప్స్‌

ప్రతి పేరెంట్‌ తప్పులు చేస్తారు. అలాగని అపరాధభావనతో కుంగిపోకండి. ఆ ప్యాటర్న్‌ను బ్రేక్‌ చేయండి.

మీ బిడ్డను ఇతరులతో పోల్చుతున్నారా? చిన్న చిన్న విషయాలకే తిడుతున్నారా? గాయం ఇక్కడే మొదలవుతుందని గుర్తించండి.

∙మీరు ఈ రోజు మాట్లాడే మాటలు, మీ బిడ్డ ఇన్నర్‌ వాయిస్‌ అవుతుంది. అందుకే ఆ వాయిస్‌ ‘ఐ యామ్‌ గుడ్‌’ అని చెప్పేలా చూసుకోండి.

∙విమర్శను కనెక్షన్‌తో మార్చండి. ‘నువ్వు లేజీ’ అని కాకుండా, ‘నువ్వు అలిసిపోయినట్టున్నావ్, మళ్లీ మాట్లాడదాం’ అని చెప్పండి. కనెక్షన్‌ = కరెక్షన్‌ అని గుర్తుంచుకోండి.

ఇంటిని సురక్షిత ప్రదేశంగా మార్చండి. నో జడ్జ్‌మెంట్‌ జోన్‌ క్రియేట్‌ చేయండి. ఫలితాలకే కాదు, ప్రయత్నానికీ సెలబ్రేషన్‌ చేయండి.

ఏఐ యుగంలో మార్కులు కాదు, మెంటల్‌ స్ట్రెంగ్త్‌ గెలిపిస్తుంది. పాత గాయాలు నయం చేయకపోతే, మీ బిడ్డ భవిష్యత్తునే సాఫ్ట్‌వేర్‌ బగ్స్‌తో నడుస్తుందని గుర్తించండి.

మీ గతం మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ప్రవర్తన మీ బిడ్డ మనసుకు గాయాలు చేయవచ్చు. అందుకే మీ గాయాలు హీల్‌ అయ్యేందుకు థెరపీ తీసుకోండి. ఇదేమీ బలహీనత కాదు. బలం. 

తల్లిదండ్రుల అపోహలు

పిల్లల మంచి కోసమే తిడుతున్నాం అనుకుంటారు కాని, ప్రేమంటే భయమనే ప్రోగ్రామ్‌ను బ్రెయిన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తున్నారనేది నిజం.

తిట్టినా పిల్లలు మర్చిపోతారనుకుంటారు. అది తప్పు. వాళ్లు మర్చిపోరు. అవి వారి అన్కాన్షస్‌లో చేరి, జీవితంలో రిపీట్‌ అవుతాయి.

భారీ ఫీజులు చెల్లించి మంచి స్కూల్‌లో చేర్పిస్తే సక్సెస్‌ గ్యారంటీ అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ఎమోషనల్‌ సేఫ్టీనే మొదటి పాఠశాల. అది పేరెంట్స్‌ నుంచే రావాలి.  
సైకాలజిస్ట్‌ విశేష్‌ 
www.psyvisesh.com

(చదవండి: ‘బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement