
రేపటి నుంచి ఆసియా చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత టాప్ షూటర్లంతా పతకాలపై గురిపెట్టేందుకు సిద్ధమయ్యారు. డబుల్ ఒలింపిక్ పతకాల విజేత మను భాకర్, సిఫ్త్ కౌర్, అర్జున్ బబుతా, సౌరభ్ చౌదరి తదితర మేటి షూటర్లు సహా 182 మందితో కూడిన భారత బృందం ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది. ఈ టోర్నీ బరిలోకి దిగుతున్న భారీ సేన మన జట్టే కావడం విశేషం.
సోమవారం నుంచి కజకిస్తాన్‌లోని షింకెంట్ నగరంలో ఈ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో 58 ఈవెంట్లలో పోటీలుంటాయి. ఇందులో 46 వ్యక్తిగత ఈవెంట్లు కాగా, 12 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ పోటీలు నిర్వహిస్తారు. భారత్ సీనియర్ విభాగంలోనే ఒక్కో ఈవెంట్‌లో ఐదుగురు చొప్పున షూటర్లను బరిలోకి దింపుతోంది. వీటిలో మూడు పతకాలకు ఆస్కారం ఉండగా, మరో ఇద్దరు ర్యాంకింగ్ పాయింట్స్ కోసం ఆడతారు.
ఇప్పటివరకు జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లలో భారత్ 59 పతకాలు గెలుపొందింది. ఇందులో 21 స్వర్ణాలు, 22 రజతాలు, 16 కాంస్యాలున్నాయి. చివరిసారిగా చాంగ్వాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఈవెంట్‌లో భారత జట్టు ఆరు బంగారు పతకాలు, 8 రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 19 పతకాలతో టాప్–3లో నిలిచింది. గత టోర్నీలో సత్తా చాటిన మను భాకర్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ విజయోత్సాహంతో ఉంది.
ఆమె 10 మీ., 25 మీ పిస్టల్ ఈవెంట్లతో పాటు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ పోటీపడనుంది. ఆమెతో పాటు ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబుతా, సౌరభ్, అనిశ్ భన్వాలాలపై భారత్ పతకాల ఆశలు పెట్టుకుంది. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఒలింపిక్ ఈవెంట్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో లేని సెంటర్ ఫైర్, స్టాండర్డ్, ఫ్రీ పిస్టల్, రైఫిల్ ప్రోన్, డబుల్ ట్రాప్ ఈవెంట్లలో కూడా పోటీలు నిర్వహిస్తారు.