
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 33–27 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. మొహమ్మద్ రెజా, అంకిత్ దహియా చెరో 8 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించగా... రాకేశ్ 6, హరీశ్ 4 పాయింట్లు సాధించారు. యూపీ తరఫున భవానీ రాజ్‌పుత్ 8 పాయింట్లు నమోదు చేయగా...గగన్ గౌడ 6, కెప్టెన్ సుమీత్ 4 పాయింట్లు సాధించారు.
ఈ విజయం తర్వాత కూడా జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ను ఒక పాయింట్ తేడాతో ఓడించి దబంగ్ ఢిల్లీ తమ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 38–37 పాయింట్లతో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్ళలో రెయిడర్ అశు మలిక్ చెలరేగిపోయాడు. అతనొక్కడే 15 పాయింట్లతో సత్తా చాటగా, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.
మరోవైపు హరియాణా తరఫున అశుకంటే మెరుగైన ప్రదర్శనే కనబర్చినా... దురదృష్టవశాత్తూ వినయ్ జట్టును గెలిపించలేకపోయాడు. వినయ్ 18 పాయింట్లతో అదరగొట్టగా, కెప్టెన్ జైదీప్ 7, ఆశిష్ నర్వాల్ 5 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లలో పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్... బెంగాల్ వారియర్స్‌తో పుణేరీ పల్టన్ తలపడతాయి.