
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ కోర్టులో సంచలన విజయాలతో రాణించిన హైదరాబాద్ ప్లేయర్ సామ సాత్విక... తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కొలువు సాధించింది. ఆరేళ్ల ప్రాయంలో టెన్నిస్ రాకెట్ చేతపట్టి జూనియర్ స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్లిన సాత్విక... డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 2020లో అత్యుత్తమంగా 809వ ర్యాంక్ సాధించింది.
హార్డ్ కోర్ట్‌పై సత్తాచాటిన ఈ హైదరాబాదీ... 2019 దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్‌లో పసిడి పతకంతో మెరిసింది. 2022 తర్వాత ఆటకు విరామమిచ్చిన సాత్విక... తాజాగా గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పోస్టుకు అర్హత సాధించింది.
శనివారం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 25 ఏళ్ల సాత్విక నియామక పత్రం అందుకుంది. ఐటీఎఫ్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 527వ స్థానంలో నిలిచిన సాత్విక ఆ తర్వాత టెన్నిస్ కాలమిస్ట్‌గానూ ఆకట్టుకుంది.