కుమారుడితో కలిసి ఆడిన లీటన్ హెవిట్
సిడ్నీ: మాజీ వరల్డ్ నంబర్‌వన్, రెండు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత లీటన్ హెవిట్ (ఆ్రస్టేలియా) రిటైర్మెంట్‌ను వదిలి ఐదేళ్ల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి మళ్లీ అడుగు పెట్టాడు. అయితే ఈ పునరాగమనానికి ప్రత్యేక కారణం ఉంది. 44 ఏళ్ల హెవిట్ తన 16 ఏళ్ల కొడుకు క్రజ్ హెవిట్ జోడీగా ఏటీపీ చాలెంజర్ టోర్నీ న్యూసౌత్‌వేల్స్ ఓపెన్ ‘డబుల్స్’లో బరిలోకి దిగాడు. ఈ ద్వయానికి వైల్డ్ కార్డ్ దక్కింది.
హెవిట్ ముగ్గురు కుమారుల్లో క్రజ్ ఒకడు. బుధవారం మొదటి పోరులో సత్తా చాటిన ఈ తండ్రీ కొడుకుల జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో లీటన్ హెవిట్–క్రజ్ హెవిట్ 6–1, 6–0తో ఆ్రస్టేలియాకే చెందిన హేడెన్ జోన్స్–పావ్లె మరింకోవ్‌ను 47 నిమిషాల్లో చిత్తు చేశారు. మరోవైపు సింగిల్స్‌లో కూడా వైల్డ్ కార్డ్‌తో బరిలోకి దిగి తొలి రౌండ్ నెగ్గిన క్రజ్ హెవిట్ రెండో రౌండ్‌లో 7–5, 3–6, 5–7తో హయటో మట్సుకోవా (జపాన్) చేతిలో ఓడి నిష్క్రమించాడు.
ప్రొఫెషనల్ కెరీర్‌లో 30 సింగిల్స్ టైటిల్స్ సాధించిన లీటన్ హెవిట్ 2001లో యూఎస్ ఓపెన్, 2002లో వింబుల్డన్ నెగ్గాడు. సొంతగడ్డపై 2005 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను వరల్డ్ నంబర్‌వన్‌గా 80 వారాల పాటు ఉన్నాడు. 2016లో సింగిల్స్‌నుంచి, 2020లో డబుల్స్‌నుంచి హెవిట్ రిటైర్ అయ్యాడు. హెవిట్ తర్వాత పురుషుల విభాగంలో ఏ ఆ్రస్టేలియన్ ఆటగాడు కూడా ఇప్పటి వరకు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ గెలవలేకపోయాడు.


