టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్
రెండు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్
డబుల్స్ మిస్సైల్స్ లియాండర్ పేస్, మహేశ్ భూపతిల తర్వాత భారత టెన్నిస్‌లో ఎవరనే ఎదురుచూపులకు రోహన్ బోపన్న తన ఆటతీరుతో తెరదించాడు. ఆ డబుల్స్ దిగ్గజ ద్వయం గెలిచినన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవకపోయినా... వాళ్లిద్దరిలా సుదీర్ఘ అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత జెండాను రెపరెపలాడించిన ఘనత మాత్రం బోపన్నకు దక్కుతుంది. రెండు దశాబ్దాలకుపైబడిన కెరీర్‌లో రాకెట్‌తో ప్రత్యర్థి జోడీలను రఫ్పాడించిన రోహన్ తాజాగా టెన్నిస్‌కు బైబై చెప్పాడు.
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. గ్రాండ్‌స్లామ్ డబుల్స్ సాధించిన నలుగురు భారత దిగ్గజాల్లో (పేస్, భూపతి, సానియా మీర్జా) ఒకడిగా ఎదిగిన ఈ ఆరడుగుల రాకెట్... ప్రొఫెషనల్ టెన్నిస్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 45 ఏళ్ల ఈ సీనియర్ ఆటగాడు చివరి సారిగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్‌లో పారిస్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొన్నాడు.
ఈ వారమే జరిగిన టోర్నీలో కజకిస్తాన్ భాగస్వామి అలెగ్జాండర్ బబ్లిక్‌తో కలిసి పోటీపడ్డాడు. కానీ తొలి రౌండ్లోనే ఈ జోడీ ఓడిపోయింది. ఇప్పుడు అదే రౌండ్ తన కెరీర్‌కు ఆఖరి రౌండ్ అయ్యింది. ‘ఎ గుడ్‌బై... బట్ నాట్ ద ఎండ్’ (ఇక సెలవ్... కానీ ముగింపు మాత్రం కాదు సుమా) అనే టైటిల్‌తో భావోద్వేగ సందేశాన్ని బోపన్న విడుదల చేశాడు.
‘మీ జీవితానికి సరిపడా సాఫల్యమిచ్చిన దానికి మీరెలా వీడ్కోలు పలుకుతారు చెప్పండి? కానీ ఇరవై వసంతాల మరుపురాని ఈ పయనానికి బైబై చెప్పే సమయం ఆసన్నమైంది. అందుకే ఈ రిటైర్మెంట్. భారత్‌లోని కూర్గ్‌లాంటి ఓ చిన్న పట్టణంలో మొదలైన నా ప్రయాణం... కూర్గ్ కాఫీ తోటల్లో పడిన నా అడుగులు అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్‌లో నా కలల్ని సాకారం చేసే దాకా తీసుకొస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు.
ప్రపంచంలోని పెద్ద పెద్ద టెన్నిస్ ఎరెనా వెలుగుజిలుగుల్లో నా ఏస్‌లు పడుతుంటే నా జీవితానికి ఇంతకు మించిన సాఫల్యమేముంటుంది’ అని బోపన్న తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. తన విజయవంతమైన కెరీర్‌కు అన్ని రకాలుగా సహకరించిన కుటుంబానికి, ఇన్నేళ్ల పాటు తనతో జోడీకట్టిన భాగస్వాములకు, కోచింగ్ బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ముఖ్యంగా తల్లిదండ్రుల తోడ్పాటు మరువలేనిది. సోదరి రష్మీ భుజం తట్టి ప్రోత్సహించింది. నా భార్య సుప్రియా వెన్నంటే నిలిచింది.
కోర్టుల్లో విజయాలకు నాతో జతకట్టిన ప్లేయర్లు కారణమైతే, కోర్టు వెలుపల ఉన్న గ్రేటెస్ట్ భాగస్వామి ఎవరైన ఉంటే అది సుప్రియానే. నా కుమార్తె త్రిద నా ఆనందాన్ని రెట్టింపు చేసే ఆయుధం’ అని కుటుంబసభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 2023లోనే అతను డేవిస్ కప్ నుంచి తప్పుకున్నాడు. చివరగా లక్నోలో మొరాకోతో జరిగిన డేవిస్ కప్ టైలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు.
2000లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిన బోపన్న 2003 నుంచి 2025 వరకు 22 ఏళ్లపాటు టెన్నిస్ కోర్టుల్లో టైటిల్స్ కోసం అలుపెరగని పోరాటం చేశాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా మ్యాచ్‌లు, చెప్పలేనన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, పలు ఒలింపిక్స్‌లో ఫలితాలతో సంబంధం లేకుండా చెమట చిందించాడు. ఎట్టకేలకు 2017లో ‘ఫ్రెంచ్ ఓపెన్’ మిక్స్‌డ్ డబుల్స్‌తో తన గ్రాండ్‌స్లామ్ కలను నెరవేర్చుకున్నాడు. కెనడాకు చెందిన గాబ్రియెలా దబ్రొస్కీతో విజేతగా నిలిచాడు.
ఇక ఏకైక పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను మాత్రం కెరీర్ చరమాంకంలో గతేడాదే అందుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్ (ఆసీస్)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్–2024లో బోపన్న తన కెరీర్‌కు లోటుగా ఉన్న పురుషుల డబుల్స్‌ను సాకారం చేసుకున్నాడు. ఈ టైటిల్‌తోనే బోపన్న లేటు వయసులో (43) ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన ఆటగాడిగా ఘనతకెక్కాడు.



