భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాలను బహిర్గతం చేసింది. తాను కొత్తగా ప్రారంభించిన ‘Serving It Up With Sania’ అనే యూట్యూబ్ షోలో మాట్లాడుతూ.. పాకిస్తానీ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని గురించి ప్రస్తావించింది.
ఈ ఎపిసోడ్‌లో బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ (Farah Khan) అతిథిగా పాల్గొంది. ఫరా సానియాకు మంచి మిత్రురాలు. ఈ షోలో సానియా-ఫరా మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. షోయబ్‌తో విడాకుల తర్వాత భయానక పరిస్థితుల్లో గడుపుతున్న తనకు ఫరా అండగా నిలిచిందని సానియా చెప్పుకొచ్చింది. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైనవిగా గుర్తు చేసుకుంది.
సానియా ఫరాతో మాట్లాడుతూ ఇలా అంది. ఆ రోజు నేను పూర్తిగా కూలిపోయే స్థితిలో ఉన్నాను. నువ్వు రాకపోతే నేను ఆ లైవ్ షో చేయలేకపోయేదాన్ని. ఆ సమయంలో నేను వణికిపోతున్నాను. నువ్వు వచ్చి ‘ఏమైపోయినా ఈ షో చేయాలి’ అని చెప్పినప్పుడు నాకు బలం వచ్చిందంటూ సానియా తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది.
ఫరా కూడా ఆ రోజు గుర్తు చేసుకుంటూ ఇలా అంది. నిన్ను అలా చూసి భయపడ్డాను. నాకు ఆ రోజు షూట్ ఉండింది. కానీ అన్నీ వదిలేసి ఇంట్లో వేసుకున్న దుస్తులతోనే అక్కడికి వచ్చేశాను. ఆ సమయంలో నీకు తోడుగా ఉండాలనిపించిందని చెప్పింది.
ఈ షో సందర్భంగా ఫరా సానియాపై ప్రశంసల వర్షం కురిపించింది. విడాకుల తర్వాత సానియా సింగిల్ పేరెంట్‌గా తన కుమారుడు ఇజ్హాన్‌ను తీర్చిదిద్దుతున్న తీరు ఆకట్టుకుందని తెలిపింది. వ్యక్తిగత జీవతంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ, కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు ఇజ్హాన్‌కు సమయం కేటాయించగలిగావని ప్రశంసించింది.
కాగా, సానియా–షోయబ్‌ల వివాహం 2010లో జరిగింది. 2018లో వారికి ఇజ్హాన్ జన్మించాడు. 2024 జనవరిలో షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించగా, సానియా కుటుంబం అప్పటికే షోయబ్‌తో విడాకులు అయిపోయాయని వెల్లడించింది.
చదవండి: ఐపీఎల్‌లో జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..!


