
బీజింగ్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చైనా స్మాష్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్ శ్రీజ 11–6, 11–9, 11–7తో ప్రపంచ 103వ ర్యాంకర్ యాంగ్ యియున్ (చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజ తన సర్వీస్‌లో 15 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 18 పాయింట్లు సాధించింది.
మరోవైపు యాంగ్ తన సర్వీస్‌లో 11 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 11 పాయింట్లు దక్కించుకుంది. శ్రీజ కాకుండా భారత్ నుంచి మెయిన్ ‘డ్రా’లో మనిక బత్రా మాత్రమే బరిలో ఉంది. భారత్‌కే చెందిన అహిక ముఖర్జీ, స్వస్తిక ఘోష్, దియా చిటాలె, యశస్విని ఘోర్పడే క్వాలిఫయింగ్ రౌండ్‌ను దాటి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు.
మానవ్ బోణీ
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ 42వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్‌లో మానవ్ 11–5, 11–6, 11–9తో ప్రపంచ 44వ ర్యాంకర్ ఫిన్ లు (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో మానవ్ తన సర్వీస్‌లో 18 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 15 పాయింట్లు సంపాదించాడు. భారత్‌కే చెందిన అంకుశ్ భట్టాచార్య తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన అంకుర్ 11–3, 9–11, 10–12, 11–6, 8–11తో నికోలస్ లుమ్ (ఆ్రస్టేలియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. భారత్‌కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్, పాయస్ జైన్, సూరావజ్జుల స్నేహిత్, హర్మీత్ దేశాయ్, మనుశ్ షా క్వాలిఫయింగ్ రౌండ్‌ను అధిగమించడంలో విఫలమయ్యారు.