ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకున్న చిన్ననాటి స్నేహితులు
రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామంలో కలకలం
హయత్‌నగర్: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది.
మంగళవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో సాయంత్రం డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం స్నానం చేసి వస్తానంటూ వెళ్లిన వైష్ణవి.. బెడ్రూంలో గడియ పెట్టుకొని చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంత సేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలుకొట్టి చూడగా వైష్ణవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటన జరిగిన మర్నాడే సతాలి వెంకటేశ్ కుమారుడు రాకేశ్ (21) బుధవారం రాత్రి తన సోదరుడి దుకాణంలో పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ షాప్ ఊడ్చేందుకు షట్టర్ తెరిచి చూసి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ మరణవార్త తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన బుద్ద నర్సింహ రెండో కుమార్తె శ్రీజ (18) ఇంట్లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది.
ఆమె సోదరి గమనించి కజిన్‌కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్రీజ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వరుస ఆత్మహత్య ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


