
మాల్మో (స్వీడన్): యూరోప్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీజ 5–11, 11–9, 15–13, 10–12, 11–8తో భారత్‌కే చెందిన ప్రపంచ 52వ ర్యాంకర్ మనిక బత్రాపై విజయం సాధించింది. 44 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు.
చివరకు కీలకదశలో పాయింట్లు నెగ్గిన శ్రీజను విజయం వరించింది. శ్రీజ మొత్తం 52 పాయింట్లు సాధించగా... అందులో తన సర్విస్‌లో 27 పాయింట్లు, ప్రత్యర్థి సర్విస్‌లో 25 పాయింట్లు సంపాదించింది. మనిక బత్రా మొత్తం 53 పాయింట్లు గెలవగా... అందులో తన సర్విస్‌లో 28, ప్రత్యర్థి సర్విస్‌లో 25 పాయింట్లు సాధించింది. భారత్‌కే చెందిన ప్రపంచ 77వ ర్యాంకర్ యశస్విని తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. యశస్విని 6–11, 2–11, 1–11తో ఐదో ర్యాంకర్ వాంగ్ యిది (చైనా) చేతిలో ఓడిపోయింది.
మానవ్ సంచలనం
ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ 43వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో మానవ్ 12–10, 11–5, 5–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ హిరోటో షినోజుకా (జపాన్)ను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.