
రన్నరప్‌గా ఆకుల శ్రీజ
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ
లాగోస్ (నైజీరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నమెంట్‌లో... భారత ప్యాడ్లర్లు సత్యన్ జ్ఞానశేఖరన్–ఆకాశ్ పాల్ టైటిల్ దక్కించుకున్నారు. తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఫైనల్లో మహిళల సింగిల్స్ పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం పురుషుల డబుల్స్ ఫైనల్లో సత్యన్–ఆకాశ్ జోడీ 3–0 (11–9, 11–4, 11–9)తో లియో నోడ్‌రెస్ట్–జులెస్ రోలాండ్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది.
పూర్తి ఏకపక్షంగా సాగిన తుది పోరు కేవలం 22 నిమిషాల్లో ముగియగా... భారత ప్యాడ్లర్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు. మ్యాచ్ ఆరంభం నుంచి జోరు కనబర్చిన భారత జోడీ తమ సర్వీస్‌లో 19 పాయింట్లు సాధించడంతో పాటు... ప్రత్యర్థి సర్వీస్‌లో 14 పాయింట్లు రాబట్టి మ్యాచ్‌ను ముగించింది. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 1–4 (7–11, 3–11, 4–11, 11–9, 11–13)తో రెండో సీడ్ హొనొకా హషిమోటో (జపాన్) చేతిలో ఓడింది.
48 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి మూడు గేమ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేక వెనుకబడి పోయిన శ్రీజ ఆ తర్వాత పుంజుకొంది. నాలుగో గేమ్‌లో హోరాహోరీగా పోరాడి విజయం సాధించిన శ్రీజ... ఐదో గేమ్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లింది. అయితే కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన జపాన్ ప్యాడ్లర్ ఒత్తిడి పెంచి విజయం సాధించింది.