క్వార్టర్స్‌లో స్నేహిత్‌  | Snehit in the quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో స్నేహిత్‌ 

Mar 21 2024 1:41 AM | Updated on Mar 21 2024 1:41 AM

Snehit in the quarters - Sakshi

డబుల్స్‌లో శ్రీజ జోడీకి కాంస్యం  

బీరుట్‌ (లెబనాన్‌): ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ఫీడర్‌ లెవెల్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సూరావజ్జుల స్నేహిత్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో స్నేహిత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా... మహిళల సింగిల్స్‌లో శ్రీజ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయింది.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్‌ స్నేహిత్‌ 11–7, 11–8, 11–13, 15–13తో ప్రపంచ 58వ ర్యాంకర్‌ అహ్మద్‌ సలెహ్‌ (ఈజిప్ట్‌)ను బోల్తా కొట్టించాడు. శ్రీజ 10–12, 9–11, 11–2, 9–11తో భారత్‌కే చెందిన ఐహిక ముఖర్జీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో శ్రీజ–దియా చిటాలె (భారత్‌) ద్వయం 9–11, 8–11, 5–11తో చాంటల్‌ మాంట్జ్‌ (జర్మనీ)–ఇజాబెలా లుపులెస్కు (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్నేహిత్‌–శ్రీజ (భారత్‌) జోడీ తొలి రౌండ్‌లో 4–11, 4–11, 8–11తో జియా లియాన్‌ ని–లుకా మ్లాడెనోవిచ్‌ (లక్సెంబర్గ్‌) జంట చేతిలో ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన మానవ్‌ ఠక్కర్‌–అర్చన కామత్‌... మనుష్‌ షా–దియా చిటాలె జోడీలు మిక్స్‌డ్‌ విభాగం ఫైనల్లోకి దూసుకెళ్లాయి.   

Advertisement
 
Advertisement
Advertisement