
45 ఏళ్ల వయసులో ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత
టోక్యో: వయసు ఒక అంకె మాత్రమేనని... ఆడాలన్న ఉత్సాహం, గెలవాలన్న కసి ఉంటే... నాలుగు పదులు దాటినా అద్భుతాలు సాధించవచ్చని భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించాడు. జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో జపాన్ ప్లేయర్ టకెరు యుజుకితో కలిసి 45 ఏళ్ల రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఏటీపీ–500 టోర్నీల చరిత్రలో ఫైనల్‌కు చేరిన అతిపెద్ద వయసు్కడిగా బోపన్న గుర్తింపు పొందాడు.
సోమవారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–టకెరు ద్వయం 4–6, 6–3, 18–16తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ క్రిస్టియన్ హ్యారీసన్–ఇవాన్ కింగ్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ‘సూపర్ టైబ్రేక్’లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం. ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో 1–4తో వెనుకబడ్డ ఈ ఇండో–జపాన్ ద్వయం ఆ తర్వాత 8–9 వద్ద... 9–10 వద్ద... 12–13 వద్ద మూడుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కింది.
ఎనిమిది ఏస్‌లు సంధించిన బోపన్న–టకెరు మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారికోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో హుగో నిస్ (మొనాకో)–ఎడువార్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)లతో బోపన్న–టకెరు తలపడతారు.
64 బోపన్న తన కెరీర్‌లో ఇప్పటి వరకు 64 టోర్నీలలో డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. ఇందులో 26 సార్లు గెలిచి విజేతగా... 37 సార్లు ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు.