కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి కూడా
లక్ష్య సేన్, ప్రణయ్ ముందంజ
కుమామోటో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, ఆయుశ్ శెట్టి, కిరణ్ జార్జి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 39 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 21–12, 21–16తో ప్రపంచ 26వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)ను ఓడించాడు.
ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 68 నిమిషాల్లో 16–21, 21–13, 23–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ లియోంగ్ జున్ హావో (మలేసియా)పై గెలుపొందాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తరుణ్ మన్నేపల్లి 9–21, 19–21తో జియోన్ హైయోక్ జిన్ (దక్షిణ కొరియా) చేతిలో, కిరణ్ జార్జి 20–22, 10–21తో కోక్ జింగ్ హాంగ్ (మలేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 16–21, 11–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయారు.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 12–21, 21–19, 20–22తో ప్రెస్లీ స్మిత్–జెనీ గాయ్ (అమెరికా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ జియా హెంగ్ జేసన్ తె (సింగపూర్)తో లక్ష్య సేన్; ప్రపంచ 30వ ర్యాంకర్ రస్‌ముస్ గెమ్కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 3–0తో జియా హెంగ్‌పై, ప్రణయ్ 4–2తో రస్‌ముస్ గెమ్కేపై ఆధిక్యంలో ఉన్నారు.
ఫైనల్లో అభిషేక్ జోడీ
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు ఒక పతకం ఖాయమైంది. భారత్‌కు చెందిన అభిషేక్ వర్మ–దీప్షిక జోడీ ఫైనల్లోకి ప్రవేశించి స్వర్ణ, రజత పతకాల కోసం పోటీపడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్–దీప్షిక ద్వయం 156–153తో రొక్సానా–ఆండ్రీ ట్యుటిన్ (కజకిస్తాన్) జంటను ఓడించింది.
అంతకుముందు భారత జోడీ క్వార్టర్ ఫైనల్లో 159–155తో వియత్నాం ద్వయంపై, తొలి రౌండ్‌లో 158– 144తో యూఏఈ జంటపై గెలుపొందింది. మరోవైపు రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో యశ్‌దీప్–అన్షిక కుమారి (భారత్) జోడీ కాంస్యం కోసం బరిలో నిలిచింది. సెమీఫైనల్లో యశ్‌దీప్–అన్షిక జంట 1–5తో సీమా అక్తర్–రామకృష్ణ సాహా (బంగ్లాదేశ్) జోడీ చేతిలో ఓడిపోయింది.


