భారత నంబర్‌వన్ షట్లర్ లక్ష్య సేన్ వ్యాఖ్య
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో సీజన్ ముగింపు
న్యూఢిల్లీ: వైఫల్యాలను అధిగమించేందుకు నేర్చుకున్న పాఠాలు, మార్చుకున్న ఆటతీరే ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టైటిల్ విజయానికి కారణమని భారత నంబర్‌వన్ షట్లర్ లక్ష్యసేన్ అన్నాడు. పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం తన గుండెను బద్దలు చేసిందని, తన ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసిందని... దీంతో శారీరక ఫిట్‌నెస్, మానసిక స్థైర్యంపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని 24 ఏళ్ల ఈ భారత బ్యాడ్మింటన్ స్టార్ చెప్పాడు.
‘పారిస్’లో కాంస్య పతకం కోసం గట్టిగానే పోరాడినా... చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకెదురైన అనుభవాలు, ఆటలో లక్ష్యాలు లక్ష్య సేన్ మాటల్లోనే...
ఫలితాలు పక్కనబెట్టి...
నాకెదురైన చేదు అనుభవాలు నాలోని స్ఫూర్తిని కొరవడేలా చేశాయి. దీంతో నా పంథా మార్చుకున్నా. ఫలితాల కోసం కాదు... ముందు ఆటతీరును మెరుగు పర్చుకోవడం కోసమే ఆడటం మొదలుపెట్టాను. దీంతో ఈ సీజన్‌లో టైటిల్స్‌లో వెనుకబడినప్పటికీ ఆటలో మార్పు, ఫిట్‌నెస్‌లో మెరుగుదల, మానసిక బలం అన్ని సానుకూలంగా మలచుకున్నాను. ఇవే తాజా విజయానికి కారణం.
పోటీ పెరిగింది
బ్యాడ్మింటన్‌లో పోటీ బాగా పెరిగింది. ఎంతో మంది మేటి షట్లర్లు వస్తున్నారు. నిలకడగా రాణిస్తున్నారు. మనం కూడా దీటుగా తయారు కావాలి. అదే ఉత్సాహంతో ఆటను కొనసాగించాలి. వచ్చే ఏడాది మాకెంతో కీలకం. రెగ్యులర్ ఈవెంట్లతో పాటు అంతర్జాతీయ టోర్నీలున్నాయి. ఫిట్‌నెస్, నిలకడ ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుతానికి ఒక్కో టోర్నీ ఆడటంపైనే దృష్టి పెట్టాను.
వైవిధ్యం చూపించాల్సిందే
సీనియర్ సర్క్యూట్‌లోకి వచ్చి మూణ్నాలుగేళ్లవుతోంది. ప్రత్యర్థులకు మన ఆట ఏంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైవిధ్యం చూపించాల్సిందే. నా కోచ్ యూ యంగ్ సాంగ్ కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాడు.
ఫిట్‌నెస్‌తో చురుకుదనం, షాట్ల వైవిధ్యంతో ఆటతీరు నన్ను మేటిగా మార్చుతుంది. అందుకే ఇప్పుడు ఒకప్పటిలా కాకుండా కొత్తగా ఆడేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నా. పూర్తి వైవిధ్యమైన ఆటతీరును కనబరచడంపైనే ఉత్సాహంగా ఉన్నా.


