
మొత్తం 8 మంది భారత షూటర్లు అర్హత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్‌కప్ ఫైనల్‌కు భారత్ నుంచి 8 మంది షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నుంచి 9 వరకు ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మన దేశం నుంచి పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మనూ భాకర్‌తో పాటు మరో ఏడుగురు షూటర్లు బరిలోకి దిగనున్నారు. 12 వ్యక్తిగత ఒలింపిక్ ఈవెంట్‌లలో ఈ ఏడాది అత్యుత్తమ షూటర్‌ను నిర్ణయించేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వీటిలో ఐదింట భారత షూటర్లు పోటీపడుతున్నారు.
స్టార్ షూటర్ మనూ భాకర్ రెండు విభాగాల్లో వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఎంపికైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌తో పాటు, 25 మీటర్ల విభాగంలో మను పోటీపడనుంది. ఇక ఈ సీజన్‌లో చక్కటి గురితో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న టీనేజర్ సురుచి సింగ్ కూడా భారత్ నుంచి బరిలోకి దిగనుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బ్యూనస్ ఎయిర్స్, లిమా, మ్యూనిక్‌లలో సురుచి పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల నింగ్బో ప్రపంచకప్‌లో స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ సైతం ఈ టోర్నీలో పాల్గొననుంది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఇషా పోటీపడనుంది. ప్రపంచ మాజీ చాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూతా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగానికి ఎంపికయ్యారు. రుద్రాంక్ష్ బ్యూనస్ ఎయిర్స్ వరల్డ్‌కప్‌లో స్వర్ణంతో మెరవగా... ఒలింపియన్ అర్జున్ లిమా ప్రపంచకప్‌లో రజతం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ సిఫ్ట్ కౌర్ సమ్రా... మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో, ఒలింపియన్ విజయ్‌వీర్ సిద్ధూ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో పోటీ పడనున్నారు. సిఫ్ట్ కౌర్ సమ్రా బ్యూనస్ ఎయిర్స్ ప్రపంచకప్‌లో స్వర్ణం గెలవగా... అదే పోటీలో విజయ్‌వీర్ పసిడి నెగ్గాడు.
మహిళల 25 మీటర్ల విభాగంలో సిమ్రన్‌ప్రీత్ కౌర్ బ్రార్ కూడా వరల్డ్‌కప్ ఫైనల్ అవకాశం దక్కించుకుంది. లిమా ప్రపంచకప్‌లో రజతం నెగ్గడం ద్వారా సిమ్రన్‌కు ఈ చాన్స్ దక్కింది. వరల్డ్‌కప్ ఫైనల్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి వరుసగా 5000 యూరోలు (రూ. 5 లక్షల 20 వేలు), 4000 యూరోలు (రూ. 4 లక్షల 16 వేలు), 2000 యూరోలు (రూ. 2 లక్షల 8 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు వరల్డ్‌కప్ వేర్వేరు విభాగాల్లో కలిసి భారత షూటర్లు 22 పతకాలు సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.