
ఉసేన్ బోల్ట్‌తో సింధు, శ్రీజేశ్, అనిమేశ్ పరుగు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ‘జమైకన్ చిరుత’ ఉసేన్ బోల్ట్ సందడి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ స్ప్రింటర్ కోసం ఢిల్లీ కాసేపు అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్‌గా మారింది. ఆసియాలోనే అతిపెద్ద మసాలా దినుసుల మార్కెట్ అయిన ఢిల్లీ ‘ఖరి బౌలీ’లో స్ప్రింట్ దిగ్గజం బోల్ట్ భారత ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, పీఆర్ శ్రీజేశ్, జాతీయ 200 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్ అనిమేశ్ కుజుర్‌లతో కలిసి అభిమానుల్ని ఉత్సాహపరిచాడు.
ప్రముఖ విదేశీ అపారల్, స్పోర్ట్స్ కిట్ ఉత్పాదక సంస్థ ‘ప్యుమా’ ఏర్పాటు చేసిన ఈ ప్రచార కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఢిల్లీ సుప్రసిద్ధ మార్కెట్ ‘ఖరి బౌలీ’ టెర్రస్ (రూఫ్ టాప్)పై ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్‌పై బోల్ట్ సరదాగా పరుగు పెట్టాడు. ఈ సరదా సరదా రిలే పరుగు ఈవెంట్‌లో బోల్ట్‌తో బ్యాడ్మింటన్ స్టార్ సింధు, మాజీ హాకీ దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేశ్, అనిమేశ్ బ్యాటన్‌ను పంచుకున్నారు. ‘క్రీడలంటే ఇదే... సరిహద్దులను చెరిపేసి, సంస్కృతిని సమ్మిళితం చేస్తూ సాగే పయనం’ అని బోల్ట్ అన్నాడు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు మాట్లాడుతూ ‘ఢిల్లీ నడిబొడ్డున బోల్ట్‌తో భుజం భుజం కలిపి పరుగు పెట్టడం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఓ క్రీడాకారిణిగా జీవితంలో ఒక్కసారైన జగది్వఖ్యాత అథ్లెట్‌తో రీలే ఈవెంట్‌లో పాల్గొనాలనే కల ఇక కల కాదు. నేటితో అది నిజమైంది. నేను క్రీడను ఎందుకింతలా ప్రేమించానో నాకు గుర్తు చేసే క్షణమిది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఖరి బౌలీలోని రూఫ్ టాప్ ట్రాక్‌పై జమైకన్ స్ప్రింటర్ బోల్ట్‌తో పాల్గొన్న ఈ రీలే తన జీవితంలో చిరస్మరణీయమవుతుందని హాకీ లెజెండ్ శ్రీజేశ్ అన్నాడు. ముగ్గురు భారత క్రీడాకారులు బోల్ట్ ట్రేడ్‌మార్క్ విక్టరీ సెలబ్రేషన్ పోజు ‘లైట్నింగ్ బోల్ట్’తో దిగ్గజాన్ని అనుకరించి... అలరించారు.