
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..! ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.. జమైకా ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) పరిస్థితే ఇందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు మెరుపు వేగంతో పరిగెత్తి రికార్డులు కొల్లగొట్టిన ఈ అథ్లెట్.. ఇప్పుడు పట్టుమని పది మెట్లు ఎక్కడానికి కూడా ఆయాసపడుతున్నాడట.
తొమ్మిది స్వర్ణాలు
ఉసేన్ బోల్టే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. 100 మీ., 200 మీ.. 4*100 మీ రిలేలలో మూడు ఒలింపిక్స్‌లో మూడేసి చొప్పున తొమ్మిది స్వర్ణాలు గెలిచిన ఘనత ఉసేన్ బోల్ట్‌ది. 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లో బోల్ట్ ఈ మేరకు పతకాలు గెలుచుకున్నాడు.
అయితే, అనూహ్య రీతిలో 2017లో బోల్ట్ అథ్లెటిక్ ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 4*100 మీ రిలేలో పాల్గొన్న బోల్ట్.. కండరాలు పట్టేయడంతో సగం దూరంలోనే కుప్పకూలిపోయాడు. అథ్లెటిక్స్ ట్రాక్‌పై బోల్ట్ అద్భుత ప్రయాణం చివరకు అలా ముగిసిపోయింది.

నాకేమీ పనిలేదు
ఇక బోల్ట్ ఇప్పుడు తన కుటుంబంతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. ది గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయంలో.. వారిని చూసేందుకు నిద్రలేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తా.
నిజానికి చేయడానికి నాకేమీ పనిలేదు. అలా చిల్ అవుతూ ఉంటా అంతే!.. కొన్నిసార్లు వర్కౌట్లు చేస్తుంటా. మూడ్ బాగుంటే వెబ్ సిరీస్‌లు చూస్తూ ఉంటా. పిల్లలు వచ్చేంత వరకు ఇలా టైమ్‌పాస్ చేస్తా.

ఇంట్లోనే సినిమాలు చూస్తా
ఆ తర్వాత సమయమంతా వాళ్లతోనే.. నాపై విసుగు వచ్చేంత వరకు వారితో ఆడుతూనే ఉంటా. ఆ తర్వాత ఇంట్లోనే సినిమాలు చూస్తా. ఇక జిమ్‌లోనే ఎక్కువగా వర్కౌట్లు చేస్తా. కానీ అదైతే నాకు పెద్దగా ఇష్టం ఉండదు.
ఆయాస పడుతున్నా
కాకపోతే తప్పక వర్కౌట్లు చేస్తా. నిజానికి నేను రన్నింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే.. మెట్లు ఎక్కేటపుడు శ్వాస సరిపోవడం లేదు. ఆయాస పడుతున్నా. అందుకే ఇకపై మరింత శ్రద్ధగా వర్కౌట్లు చేసి నా బ్రీత్‌ను సరి చేసుకుంటా’’ అని ఉసేన్ బోల్ట్ చెప్పుకొచ్చాడు.
కాగా జమైకన్ ఇన్‌ఫ్లూయెన్సర్ కాసీ బెనెట్‌తో చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు 39 ఏళ్ల బోల్ట్. ఆమె ద్వారా.. అతడికి కూతురు ఒలింపియా (2020), కవల కుమారులు థండర్- సెయింట్ (2021) కలిగారు.
చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్