
జమైకా ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒలింపిక్స్‌లో తొమ్మిది పసిడి పతకాలు కైవసం చేసుకున్న చరిత్ర అతడిది. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో ఈ అథ్లెట్.. 100 మీ., 200 మీ.. 4*100 మీ. రిలేలలో ఈ మేరకు మెడల్స్ సాధించాడు.
క్రికెటర్ కావాలని కల
నిజానికి ఉసేన్ బోల్ట్ చిన్ననాటి నుంచి క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. ఫాస్ట్ బౌలర్‌గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేశాడు. అయితే, పాఠశాల స్థాయిలో క్రికెట్ టోర్నీలో ఆడుతున్నపుడు బోల్ట్‌ను చూసిన ఓ కోచ్.. నీకున్న మెరుపు వేగం అథ్లెట్‌గా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
దీంతో ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈ జమైకన్.. ప్రపంచంలోని అత్యుత్తమ స్ప్రింటర్లలో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు.. కొంతమంది క్రికెటర్లకూ సాధ్యం కాని విధంగా వందల కోట్లు సంపాదించాడు.

అయితే, ఒకప్పటి ఈ ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసం వస్తోందంటూ తన ఫిట్‌నెస్ సమస్యల గురించి చెప్పి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అంతేకాదు.. తాను ఇంట్లోనే ఎక్కువగా ఉంటానని.. పిల్లలతో ఆడుకోవడం, సినిమాలు చూడటం ఇవే తన హాబీలు అని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఉసేస్ బోల్ట్ నెట్‌వర్త్ ఎంత అన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఒక్క బ్రాండ్ ద్వారానే ఏడాదికి రూ. 75 కోట్లు!
రిటైర్మెంట్ తర్వాత కూడా ఉసేన్ బోల్ట్ క్రేజ్ తగ్గలేదు. విశ్వ క్రీడల్లో తన విజయ ప్రస్థానాన్ని అతడు.. వ్యాపార సామ్రాజ్యానికి పునాదిగా మార్చుకున్నాడు. ప్రముఖ బ్రాండ్ పూమా ప్రమోషన్ ద్వారా ఏడాదికే బోల్ట్ రూ. 75 కోట్ల మేర ఆర్జిస్తున్నట్లు సమాచారం.
అంతేకాదు.. వీసా, గాటొరేడ్, నిసాన్‌లకు కూడా అతడు అంబాసిడర్‌గా ఉన్నాడు. అదే విధంగా.. వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం, బ్రాండ్ టై-అప్‌ల ద్వారా బోల్ట్ బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యాపార రంగంలో..
రిటైర్మెంట్ తర్వాత బోల్ట్ వ్యాపార రంగంపై దృష్టి సారించాడు. తనకున్న రెస్టారెంట్ చైన్ ‘ట్రాక్స్ అండ్ రికార్డ్స్’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. అంతేకాదు.. బోల్ట్ మొబిలిటీ పేరిట మొదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీకి అతడు సహ వ్యవస్థాపకుడు కూడా!
మొత్తానికి ఇలా రెండు చేతులా సంపాదన పోగేస్తున్న బోల్ట్ నెట్‌వర్త్.. అక్షరాలా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు (రూ. 750 కోట్లు) అని వివిధ నివేదికల ద్వారా వెల్లడవుతోంది.

నిరాడంబర జీవితం
జమైకాలోని షేర్‌వుడ్ కంటెంట్‌లో 1986లో జన్మించిన ఉసేన్ బోల్ట్.. ప్రస్తుతం కింగ్‌స్టన్‌లో జీవిస్తున్నాడు. తన సహచరి కేసీ బెనెట్, తమ కుమార్తె ఒలింపియా, కవల కుమారులు థండర్- సెయింట్‌లతో కలిసి నిరాడంబర జీవితం గడుపుతున్నాడు.
చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా..