
ముంబై: క్రికెటర్లు మైదానంలో చూపే అంకితభావం... ఆట కోసం వారు కష్టపడే తీరు చూసి ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేర్కొన్నాడు. క్రికెటర్లు గ్రౌండ్‌లో తమ సర్వస్వాన్ని అంకితం చేయడం... అథ్లెటిక్స్‌లో తాను రాణించేందుకు ప్రేరణనిచ్చిందని ఈ ‘జమైకా చిరుత’ వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు పరుగుకు పర్యాయపదంగా నిలిచిన బోల్ట్ 8 ఒలింపిక్ స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పతకాలు సాధించాడు. శుక్రవారం ముంబైలోని జమునాబాయి నర్సీ క్యాంపస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బోల్ట్ పాల్గొన్నాడు.
ఈ కార్యక్రమంలో క్రీడా రంగ ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోల్ట్ మాట్లాడుతూ... ‘నేను చిన్నప్పుడు క్రికెట్‌కు వీరాభిమానిని. క్రికెట్ ఎదుగుదలను చూశాను. క్రికెటర్ల ప్రతిభను, వారు పనిచేసే తీరును, వారు తమను తాము మలుచుకునే విధానం అథ్లెటిక్స్‌లో నాకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి’ అని అన్నాడు.
మైకెల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్, క్రిస్ గేల్ వంటి పలువురు ప్రఖ్యాత క్రికెటర్లు కూడా జమైకన్‌లే కాగా... వారి ప్రభావం తనపై అధికంగా ఉన్నట్లు బోల్ట్ పేర్కొన్నాడు. విజయానికి దగ్గరి దారులు ఉండవన్న బోల్ట్ కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని అన్నాడు. ‘ప్రతి పనికి కష్టపడాల్సిందే. క్రీడల్లో అంకితభావం కూడా అవసరం. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానిపై ఎక్కువ కష్టపడ్డా. ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరడం అంత సులభం కాదు.
పరిస్థితులు పరీక్షిస్తున్నప్పుడు కఠిన సమయాలను దాటుకుంటూ ప్రపంచంలో అత్యుత్తమ అథ్లెట్‌గా నన్ను నేను మలుచుకునేందుకు పట్టుదల, అంకితభావంతో కృషి చేశా. అందుకు తగ్గ ప్రతిఫలం సాధించా’ అని 39 ఏళ్ల బోల్ట్ అన్నాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు) నెలకొల్పిన బోల్ట్... గతంలోనూ పలు సందర్భాల్లో తనకు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని వెల్లడించాడు.