
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ తమ నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–28 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఆరో విజయం కావడం విశేషం. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మలిక్ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మొత్తం 23 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన విజయ్ 13 పాయింట్లు సాధించాడు. ఇందులో తొమ్మిది టచ్ పాయింట్లుకాగా... మూడు బోనస్ పాయింట్లు, ఒకటి టాకిల్ పాయింట్ ఉండటం విశేషం. మరో ఆల్‌రౌండర్ భరత్ 8 పాయింట్లు స్కోరు చేయగా... డిఫెండర్ అంకిత్ 4 పాయింట్లు సంపాదించాడు.
చేతన్, శుభమ్ షిండే మూడు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్ అయాన్ 13 పాయింట్లతో మెరిపించినా... ఇతర ప్లేయర్లు తడబడటంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 49–44 పాయింట్లతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పుణేరి తరఫున ఆదిత్య షిండే 18 పాయింట్లు, పంకజ్ మొహితే 13 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ రెయిడర్ దేవాంక్ ఏకంగా 25 పాయింట్లు సాధించినా చివరకు ఆ జట్టును గట్టెక్కించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తమిళ్ తలైవాస్ తలపడతాయి.