
ఈ అత్యాధునిక చర్మ సంరక్షణ పరికరం అందాన్ని కోరుకునేవారికి ఒక వరం. చర్మానికి ఎల్‌ఈడీ థెరపీలను అందించే డివైస్‌లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా, సౌందర్యప్రియులకు ఈ మెషిన్ అందించే పర్ఫెక్షనే వేరు! దీనిలోని ఫొటో–బయోమాడ్యులేషన్ టెక్నాలజీ.. ఆన్ చెయ్యగానే ఎరుపు కాంతిని విడుదల చేస్తూ, కేవలం 12 నిమిషాల్లోనే ముఖానికి కొత్త మెరుపుని అందిస్తుంది. దీని పనితీరు క్లినికల్ పరీక్షల్లో కూడా నిగ్గుతేలింది.
ఈ డివైస్ ముఖాకృతిలోనే రూపొందడంతో దీని ముందు ముఖాన్ని ఉంచినప్పుడు అన్నివైపుల నుంచి లైట్ థెరపీ జరుగుతుంది. దాంతో చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. ఈ డియోర్ స్కిన్ లైట్ థెరపీని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు అందుకున్న తర్వాత వయసుతో వచ్చే ముడతలు, మచ్చలు చాలా వరకూ తగ్గుతాయి. చర్మం యవ్వనంగా మారుతుంది.
ఈ మాస్క్ డివైస్ అన్ని రకాల చర్మాలకు అనువైనదే. సున్నితమైన స్కిన్ టైప్ ఉన్నవారికి కూడా పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డివైస్ ఒక టేబుల్ ల్యాంప్‌లా అనిపిస్తుంది. దీని స్టాండ్ ఎటువైపు అయినా వంగుతూ, వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఆన్ చేసి లైట్ థెరపీ పొందేటప్పుడు, పడుకుని లేదా కూర్చుని కూడా ఈ ట్రీట్‌మెంట్ పొందొచ్చు.
వినూత్నమైన బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌లో ‘స్నెయిల్ క్రాల్ ట్రీట్‌మెంట్’ లేదా ‘స్నెయిల్ ఫేషియల్’ ఒక రకం! ఈ చికిత్సలో నత్తల నుంచి స్రవించే జిగురుతో చర్మంపై మసాజ్ చేస్తారు. ఈ విధానం ఎన్నో ఏళ్ల క్రితమే గ్రీస్‌లో ప్రారంభమైంది. తూర్పు ఆసియాలో, ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ నత్త జిగురుతో చర్మం తేమను పెంచడం, గాయాలను నయం చేయడం, కణాల పునరుద్ధరణ చేయడంతో పాటు కొన్ని రకాల చర్మ క్యాన్సర్‌లను కూడా నివారించవచ్చని నిపుణులు తేల్చారు.
ఈ ట్రీట్‌మెంట్‌తో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయి. అలాగే గాయాలు, అలర్జీలు, దురదలు వంటి సమస్యలు కూడా నయమవుతాయి. ఈ చికిత్సలో నేరుగా నత్తను చర్మంపై వదులుతారు. లేదంటే నత్త నుంచి సేకరించిన జిగురు ముఖానికి పూస్తారు. నత్త జిగురుతో ఇప్పుడు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి.
(చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?)