
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మానవత్వం మంటగలిసిన ఉదంతం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన సొంత తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను ‘శిక్షిస్తున్నాడని’ ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన కుమారునిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వీరి కుటుంబం హౌజ్ ఖాజీ ప్రాంతంలో ఉంటోంది. బాధితురాలి పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ఆమె అదే పరిసరాల్లో తన భర్త, అత్తమామలతో ఫాటు ఉంటోంది.
జూలై 17న బాధితురాలు, ఆమె భర్త , చిన్న కుమార్తె సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సమయంలో నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వారిని వెంటనే తిరిగి రమ్మని కోరాడు. తల్లికి వెంటనే విడాకులు ఇవ్వాలని, ఆమెకు కొన్నేళ్లుగా ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తాను కనుగొన్నానని చెప్పాడు. తరువాత కూడా కుమారుడు ఇదే తరహాలో తండ్రికి ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలో అరేబియా నుంచి వారి కుటుంబం ఆగస్టు ఒకటిన ఢిల్లీకి తిరిగివచ్చింది.
తల్లిని చూడగానే ఆ కుమారుడు ఆమెపై దాడి చేశాడు. కుమారుని ప్రవర్తనకు భయపడి తల్లి ఇల్లు విడిచిపెట్టి పెద్ద కుమార్తె ఇంటిలో ఆగస్టు 11 వరకూ ఉంది. ఆ తరువాత ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో, నిందితుడు తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాడు. తరువాత ఆమెను గదిలో బంధించి, అత్యాచారం చేశాడు. ఆమె ఎంతలా వేడుకున్నప్పటికీ విడిచిపెట్టలేదు. గతంలో ఆమె చేసిన తప్పుకు శిక్షిస్తున్నానని చెప్పాడు.
బాధితురాలు వెంటనే ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే గురువారం తెల్లవారుజామున కుమారుడు ఆమె గదిలోనికి వచ్చి మళ్లీ లైంగిక దాడి చేశాడు. మర్నాడు తల్లి జరిగిన విషయాన్ని చిన్న కుమార్తెకు చెప్పింది. తరువాత వారిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, నిందితునిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తుకు ఉపక్రమించారు.