
గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాదాపూర్ డీసీపీ వినీత్
చోరీ ఘటనలో ఇద్దరి అరెస్ట్
10 కిలోల వెండి ఆభరణాల్లో 900 గ్రాముల స్వాధీనం
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు.
వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...
బిహార్‌కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్‌లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.
బిహార్‌లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై
రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్‌పై 4 కేసులున్నాయి.
దొంగ చిక్కాడు ఇలా....
ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.
దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్‌ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్‌ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు.