వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు? | Some Movies release gets postponed in Tollywood | Sakshi
Sakshi News home page

వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?

Aug 17 2025 3:48 AM | Updated on Aug 17 2025 3:48 AM

Some Movies release gets postponed in Tollywood

ఒకప్పుడు షూటింగ్‌ పూర్తి చేసుకుని, థియేటర్స్‌ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్‌ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్‌–థియేట్రికల్‌ రైట్స్‌ అమ్మకాలు, బాక్సాఫీస్‌పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు... ఇలా ఓ సినిమా రిలీజ్‌ కావడానికి, కాకపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తున్న కొన్ని సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.

ఈ సెప్టెంబరు 5న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అనుష్కా శెట్టి ‘ఘాటి’, రష్మికా మందన్నా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’, తేజ సజ్జా ‘మిరాయ్‌’, ‘ది బెంగాలీ ఫైల్స్‌’, శివకార్తికేయన్‌ ‘మదరాసి’ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకే  తేదీకి రిలీజ్‌ కావడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని, ఈ వాయిదా పడే చిత్రాల్లో ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ఉండొచ్చనే టాక్‌ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా, దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు.

అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సెప్టెంబరు 5న రిలీజ్‌ కావాల్సిన విజయ్‌ ఆంటోనీ ‘భద్రకాళి’ చిత్రం సెప్టెంబరు 19కి వాయిదా పడింది. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాను అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ – స్పిరిట్‌ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. 200 కోట్ల రూ పాయల భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ ‘భద్రకాళి’ సినిమా కథనం సాగుతుంది.

సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్‌?
నిర్మాతలు–సినీ కార్మికుల మధ్య వేతనాల పెంపు విషయమై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జరగడం లేదు. ఈ ప్రభావం సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలపై పడొచ్చు. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోని సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆగస్టు 5 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలు కాలేదు. దీంతో షూటింగ్‌కు ఆలస్యమౌతోంది. 

సమ్మె కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకా రవితేజ ‘అనార్కలి’, నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రబృందాలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ప్రకటించాయి. కానీ సినీ కార్మికుల ప్రస్తుత సమ్మె కారణంగా సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సిన సినిమాలపై ఎఫెక్ట్‌ పడుతుందని తెలుస్తోంది. అలాగే డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధమౌతున్న అడవి శేష్‌ ‘డెకాయిట్‌’   చిత్రంపై కూడా ఈ సమ్మె ప్రభావం కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

సత్యలోకానికి పయనం 
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా థియేటర్స్‌లోకి రాలేదు. సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా విడుదల కాకపోవడంతో సమ్మర్‌కి థియేటర్స్‌లోకి వస్తుందని ఆడియన్స్‌ ఊహించారు. కానీ సమ్మర్‌లో కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఆ మాటకొస్తే... ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత లేదు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ యాక్షన్‌ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటించారు.

బాలీవుడ్‌ నటి మౌనీ రాయ్‌ ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ రెడ్డి నిర్మించిన ఈ ‘విశ్వంభర’ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్‌ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో క్వాలిటీ పరంగా చిత్ర యూనిట్‌ రాజీ పడకుండాపోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చేయిస్తోందని సమాచారం. గ్రాఫిక్స్‌ కోసమే రూ. 25 కోట్లకుపైగా బడ్జెట్‌ను మేకర్స్‌ కేటాయించారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీజర్‌ విడుదల కావొచ్చని, ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడు ఓ స్పష్టత వస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇక పద్నాలుగు లోకాలను దాటి, హీరో సత్యలోకం వెళ్లి, అక్కడ హీరోయిన్‌ను ఎలా కలుసుకుంటాడు? అనే నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో విశ్వంభర అనే పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ పుస్తకంలోని అంశాల ఆధారంగానే హీరో సత్యలోకానికి వెళ్తాడని, ఈ క్రమంలో హీరోకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో రావు రమేశ్‌ నటించారని టాక్‌.

ఆలస్యంగా రాజాసాబ్‌ 
ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న హారర్, కామెడీ అండ్‌ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్‌’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్‌ దత్, వీటీవీ గణేశ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని డిసెంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావడం లేదని, సంక్రాంతికి ఈ విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్‌ వర్క్‌ పెండింగ్‌ ఉండటం ‘ది రాజాసాబ్‌’ విడుదల వాయిదాకు ప్రధాన కారణమట. పైగా ఈ సినిమా కోర్టు కేసులో ఇరుక్కుందనే టాక్‌ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘ది రాజాసాబ్‌’ చిత్రం ప్రధానంగా తాత–మనవడి అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.

ఈ చిత్రంలో ప్రభాస్‌ తాతయ్య పాత్రలో సంజయ్‌ దత్‌ కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో ‘రాజా డీలక్స్‌’ అనే భవనం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ భవనం లోపలే ప్రధాన కథ జరుగుతుందని తెలిసింది.

పండక్కి రానట్లే! 
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఆగస్టు 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ విడుదల వాయిదా పడిందని భోగట్టా.

ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉందని, అలాగేపోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌కి కూడా ఇంకా సమయం పట్టేట్లు ఉందని... ఈ కారణాల వల్లే ‘మాస్‌ జాతర’ ఈ వినాయకచవితి పండక్కి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం లేదనే టాక్‌ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి వాయిదా వేశారు. ఇటీవల ఆగస్టు 27న రిలీజ్‌ అంటూ ప్రకటించారు మేకర్స్‌. 

కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ‘మాస్‌ జాతర’ సినిమా రిలీజ్‌ కావడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్‌ భేరీ అనే రైల్వేపోలీస్‌ ఆఫీసర్‌గా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో రైల్వేస్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోతుందట. అలాగే హీరో రవితేజ–విలన్‌ నవీన్‌చంద్ర కాంబినేషన్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు మాస్‌ ఆడియన్స్‌ను అలరించేలా ఉంటాయని తెలిసింది.

సంబరాలు ఎప్పుడు? 
సాయి దుర్గా తేజ్‌ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. రూ. 125 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేపీ రోహిత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్‌’ ఫేమ్‌ చైతన్యా రెడ్డి, కె. నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 25న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఈ సెప్టెంబరు 25నే పవన్‌ కల్యాణ్‌  గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’, బాలకృష్ణ మైథలాజికల్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా ‘అఖండ 2’  రిలీజ్‌కు రెడీ అయ్యాయి. దీంతో సాయిదుర్గా తేజ్‌ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల వాయిదా పడుతుందనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు 80 శాతంపైనే పూర్తయింది. కానీ విడుదల తేదీపై మేకర్స్‌ నుంచి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి కాబట్టి  ఈ తేదీకి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రాకపోవచ్చనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. కొత్త విడుదల తేదీపై మేకర్స్‌ నుంచి అతి త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలిసింది.

స్వయంభూ 
నిఖిల్‌ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘స్వయంభూ’. భరత్‌ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా, సునీల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు మేకర్స్‌. 

కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఓ దశలో ఈ దసరాకు ‘స్వయంభూ’ సినిమాను రిలీజ్‌ చేయాలనే ఆలోచన చేశారట మేకర్స్‌. కానీ భారీ వీఎఫ్‌ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఉండటంతోపోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు మరింత సమయం పడుతుందని, ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. శక్తికి, ధర్మానికి చిహ్నమైన సెంగోల్‌ (బంగారు రాజదండం) నేపథ్యంలో  ‘స్వయంభూ కథనం సాగుతుందట. మరో విషయం ఏంటంటే... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ΄్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

ఓం శాంతి శాంతి శాంతిః 
తరుణ్‌ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వంలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అ΄్పాజీ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్‌ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్‌ కృష్ణ, అనూప్‌ చంద్రశేఖరన్, సాధిక్‌ షేక్, నవీన్‌ సనివరపు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బా, వ్యాన్‌ యజమాని అంబటి ఓంకార్‌ నాయుడుగా తరుణ్‌ భాస్కర్‌ నటించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

ఆ మధ్య ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. కానీ, ఆగస్టు 1న ఈ సినిమా విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై మేకర్స్‌ నుంచి త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక మలయాళంలో సూపర్‌డూపర్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రూపొందిందని  తెలిసింది. భార్యాభర్తల నేపథ్యంలో  ‘జయ జయ జయ జయహే’ సినిమా కథనం సాగుతుంది. మహిళలంటే చులకన భావం ఉన్న ఓ భర్తకు అతని భార్య ఏ విధంగా బుద్ధి చెప్పిందన్నదే ఈ సినిమా కథనం.

భార్యాభర్తల కథ 
లావణ్యా త్రి పాఠి, దేవ్‌ మోహన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. భార్యాభర్తల అనుభందం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్‌ఎమ్‌ఎస్‌ (శివ మనసులో శ్రుతి)’ చిత్రాల ఫేమ్‌ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌ను విడుదల చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. 
ఇలా ఈ ఏడాదిలో రిలీజ్‌కు సిద్ధం అవుతూ, ఇంకా విడుదల తేదీని కన్ఫార్మ్‌ చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement