
రాష్ట్రంలో 75వేల బెల్టుషాపులు తొలగించే వరకు ఉద్యమం
కల్లుగీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం
గీత కార్మికుల వృత్తిని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోంది
మంత్రి నియోజకవర్గంలోనే లెక్కలేనన్ని బెల్ట్ షాపులు
గీత కార్మికుల ఆవేదన, ఆక్రందన
ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు
22న అన్ని జిల్లాల్లో సమావేశాలు
30న జిల్లాల్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసుల ముట్టడి
సెప్టెంబర్ 8న మంగళగిరిలో ‘ఎక్సైజ్ కమిషనర్‌ను కలుద్దాం రండి’
10న సీఎంకు వినతిపత్రం
అప్పటికీ స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం
సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో 75వేల మద్యం బెల్ట్‌షాపులను తొలగించి, గీత కార్మికుల ఉపాధిని కాపాడే వరకు పోరాటం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకే)లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఆండ్ర మాల్యాద్రి(కేవీపీఎస్), పి.బాలకృష్ణ(ఏపీ చేనేత కార్మిక సంఘం), ఎం.భాస్కరయ్య(వృత్తిదారుల సంఘం), రామన్న, అనిల్, రమాదేవి, రెడ్డయ్య వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ బతుకుదెరువు కోసం గీత కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులు తొలగించి గీత కార్మికుల ఉపాధిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 58 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదరర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోకపోగా ఉన్న ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మద్యం ఆదాయం రుచి మరిగిన ప్రభుత్వం కల్లు అమ్మకాలను దెబ్బతీసి గీత కార్మికుల పొట్ట కొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే లెక్కలేనన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని, అక్రమ మద్యం ఏరులై పారుతోందని, ఇక రాష్ట్రంలోని దుస్థితి చెప్పనవసరంలేదని పేర్కొన్నారు. మంచినీటికి కొరత ఉందేమోకానీ మద్యం ఎక్కడç³డితే అక్కడ దొరకడంతో రాష్ట్రంలో నిత్యం హత్యలు, లైంగికదాడులు వంటి ఘోరాలు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జుత్తిగ నరసింహామూర్తి హెచ్చరించారు.
దశలవారీ పోరాటంలో కీలక ఘట్టాలు ఇలా..
గీత కార్మికుల సమస్యలపై ఉద్యమించేందుకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 58 రోజులపాటు నిర్వహిస్తున్న దశలవారీ పోరాటంలో ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. 30న జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి సెపె్టంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమిషనర్‌ను కలుద్దాం రండి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు.
సెప్టెంబర్ 10న ముఖ్యమంత్రికి సమస్యలపై వినతిపత్రం అందించి 12న బెల్ట్ షాపులు, కల్లు పాలసీ, ఉపాధిపై జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెపె్టంబర్ 25న జిల్లాల్లో సమీక్షలు, సభలు నిర్వహించి అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 30 తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని జుత్తిగ నరసింహమూర్తి వెల్లడించారు.
ఈ సమావేశంలో సిమ్మ అప్పారావు, కడలి పాండు బత్తిన నాగేశ్వరరావు, దాసరి సూరిబాబు, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు, బెజవాడ వెంకటేశ్వరరావు, నోట్ల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు.