
ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే.. ముఖాముఖి నిర్వహించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగిన తరువాత వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు చేయడం మొదలైంది. ఈ విధానం ద్వారా ఇంటర్వ్యూలు జరిపితే.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్యూలపై గూగుల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు.
వర్చువల్ విధానంలో ఇంటర్యూలు నిర్వహిస్తుంటే అభ్యర్థులు కొందరు మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నివారించడానికే గూగుల్ కంపెనీలో మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు 'సుందర్ పిచాయ్' పేర్కొన్నారు. ఏఐ వినియోగం పెరుగుతున్నందున వర్చువల్ ఇంటర్వ్యూలు సమంజసం కాదని కంపెనీలోని ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా.. ఇంటర్యూలను షెడ్యూల్ చేయడం సులభం. అంతే కాకుండా శ్రమ, వ్యయం కూడా తగ్గుతాయి. అయితే కొందరు మోసం చేయడం మొదలు పెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఇంటర్వ్యూ చేయదలచిన అభ్యర్థిని, కనీసం ఒక్కసారైనా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలు
ప్రస్తుతం ఈ సమస్య ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా.. అమెజాన్, ఆంత్రోపిక్ , సిస్కో, మెకిన్సే వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. కంపెనీలన్నీ వర్చువల్ ఇంటర్వ్యూ విధానానికి మెల్లగా చరమగీతం పాడేసి, మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.