
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పర్యటనకు గాను సోమవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకునే విషయమై జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)అజిత్ ధోవల్‌తో ఆయన చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) వార్షిఖ శిఖరాగ్ర భేటీలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెలాఖరులో చైనా వెళ్లనున్న సమయంలో వాంగ్ యీ చేపట్టనున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
సరిహద్దు సమస్యపై రెండు దేశాల ప్రభుత్వాలు నియమించిన ప్రత్యేక ప్రతినిధులు వాంగ్, ధోవల్‌లు. గతేడాది డిసెంబర్‌లో అజిత్ ధోవల్ చైనా వెళ్లి వాంగ్‌తో చర్చలు జరిపారు. ఈ దఫా అజిత్ ధోవల్ ఆహ్వానం మేరకు వాంగ్ యీ భారత్‌కు వస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధానంగా సరిహద్దు సమస్యపైనే వీరు చర్చలు సాగనున్నాయి. రెండు రోజుల పర్యటన సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా వాంగ్ యీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఎస్‌సీవో శిఖరాగ్రం చైనాలోని టియాంజిన్‌లో ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగనున్నాయి. చైనా ప్రస్తుత ఎస్‌సీవో అధ్యక్ష బాధ్యతల్లో ఉంది.
ప్రధాని మోదీ ఈ నెల 29వ తేదీన జపాన్‌లో పర్యటించనున్నారు. అట్నుంచి చైనాలోని టియాంజిన్‌కు వెళ్తారు. 2020 మేలో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాల సైనికుల నడుమ తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నప్పటి నుంచి సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు దేశాలు వేలాదిగా సైనికులను సరిహద్దులకు అత్యంత సమీపంలో మోహరించడం, అనంతరం కొన్ని పాయింట్లలో ఉపసంహరించుకోవడం తెల్సిందే. మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపుపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.