కాబూల్: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్తాన్‌కు ఆప్ఘన్ తాలిబన్ల ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంపై భవిష్యత్తులో జరిగే ఏ సైనిక దాడినైనా ధీటుగా ఎదుర్కొంటామని తాలిబాన్ హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ హెచ్చరించారు. పోరాడటంలో తమకు ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా మూడో విడత శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాలిబాన్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు. కాగా, ఎటూ తేలకుండానే చర్చలు ముగిశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రతినిధి బృందం బాధ్యతారాహిత్య వైఖరే దీనికి కారణమని తాలిబన్ బృందంలోని నేత జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్‌లోని కొన్ని శక్తులు చర్చలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్ అంతర్గత సమస్యలు, అభద్రత, ‘తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్’ ఉగ్రదాడులకు తమ ప్రభుత్వాన్ని నిందించేందుకు అవి యత్నిస్తున్నాయని తెలిపారు.
మరోవైపు పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌తో చర్చల వ్యవహారం ముగిసిందన్నారు. భవిష్యత్తు సమావేశాలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదని తెలిపారు. చర్చల అనంతరం ఉత్త చేతులతో తిరిగి రావడం.. మధ్యవర్తులకు కూడా తాలిబన్లపై ఆశ లేదని విషయాన్ని చాటుతోందని కామెంట్స్ చేశారు.
అనంతరం, ఖవాజా వ్యాఖ్యలపై తాలిబాన్ హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ స్పందిస్తూ.. ‘ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే, మా ప్రతిస్పందన చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్న వాళ్ళం. యుద్ధ భూమిలో ఆప్ఘన్‌లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మళ్లీ పోరాడటంలో మాకు ఇబ్బంది లేదు. చర్చలు విఫలమవడంతో, సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం మళ్లీ నెలకొంది. పాకిస్తాన్‌తో యుద్ధం చేసేందుకు మేము సిద్ధమే అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు, పరస్పర దాడులతో భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది.


