చైనా-భారత్ నడుమ సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇరు దేశాల సైన్యాలు ఈ మేరకు లోతైన చర్చలే జరిపినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ వర్గాలు ఈ ప్రకటనను ధృవీకరించాల్సి ఉంది.
పశ్చిమ సరిహద్దు ప్రాంతాల నిర్వహణపై కీలక చర్చలు జరిగాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో సైనిక , దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపింది. ఈ సమావేశం అక్టోబర్ 25వ తేదీన భారత వైపు ఉన్న ఒక నిర్దిష్ట సమావేశ స్థలంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే..
ఇదే తరహాలో జూలైలో కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చలు జరిగాయి. చైనా ఈ చర్చలను కూడా “స్పష్టమైన”విగా పేర్కొంది. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుతంగా, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయని తెలిపింది.
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సైనిక మోహరింపుతో నాలుగేళ్ల పాటు ఉద్రిక్త పరిస్థితులే కొనసాగాయి. అయితే.. 2024 అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందం తర్వాత ఇండియా-చైనా సంబంధాలు మెరుగవుతున్న సూచనలు కనిపించాయి. ఈలోపు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య తియాంజిన్‌లో షాంగై సమ్మిట్ సందర్భంగా చారిత్రక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, “భారత్-చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు” అని ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకోవడం, పరస్పర గౌరవం, సహకారం అందించుకోవడంపై రెండు దేశాలు అంగీకరించాయని ఆ సందర్భంలో మోదీ తెలిపారు. ఈ భేటీ వేదికగా.. వాణిజ్య, పౌరవిమానయాన, పెట్టుబడుల పరంగా పరస్పర సహకారం పెంచేందుకు 12 అంశాలపై అవగాహన ఏర్పడింది.
అయితే ఈ ఒప్పందాల తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారతాయని భావించినప్పటికీ.. అలాంటిదేం కనిపించేదు. ప్రస్తుతం.. తూర్పు లడాఖ్‌లో LAC వెంబడి ఇరు దేశాలు సుమారు 50,000–60,000 సైనికులను మోహరించాయి. అయితే తాజా చర్చల పురోగతితో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: పాక్ ఇంక మారదా?.. మళ్లీ పిచ్చి ప్రేలాపనలు


