ఇస్లామాబాద్: తుర్కియే వేదికగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ఘనిస్థాన్ నాయకత్వం భారత్ కీలు బొమ్మగా మారిపోయిందంటూ విమర్శలు చేశారు. అలాగే, ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి జరుగుతుంది అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో న్యూస్‌తో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ నాయకత్వం ఢిల్లీకి ఒక సాధనంగా వ్యవహరిస్తోంది. భారత్ చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది. భారత్ చెప్పిన విధంగా కాబూల్ ప్రజలు తీగలను లాగుతూ, తోలుబొమ్మ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. భారత్ పశ్చిమ సరిహద్దులో ఓటమికి పరిహారం చెల్లించడానికి ఆఫ్ఘనిస్థాన్‌ను ఉపయోగిస్తోంది. భారత్ కారణంగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చర్చలు విఫలమయాయి. కాబూల్ పవర్ బ్రోకర్లు భారత్ ప్రభావంతో చర్చలను దెబ్బతీశారు. పాకిస్తాన్‌తో భారత్ తక్కువ తీవ్రత గల యుద్ధంలో పాల్గొనాలని అనుకుంటోంది. దీన్ని సాధించడానికి కాబూల్‌ను పాక్‌పై ఉపయోగిస్తున్నారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి కాబూల్ కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
చర్చలు విఫలమైతే యుద్ధమే!
ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమైతే ప్రత్యక్ష సంఘర్షణ తప్ప మాకు మరే ఆప్షన్ లేదని ఖవాజా అసిఫ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం.. మరో యుద్ధాన్ని భరించలేని ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. పాక్, ఆప్ఘన్ ప్రతినిధులు ఇప్పటికీ టర్కీలోనే ఉన్నప్పటికీ, నాలుగో దఫా చర్చలపై ఎటువంటి సమాచారం లేదు. దీంతో, జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది.
మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాల అధికార మీడియాలు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించాయి. ఈ ప్రతిష్టంభనకు మీరంటే మీరే కారణమని ఇరు దేశాలూ ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ బృందం నిర్మాణాత్మక చర్చలకు అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపింది. దీనిపై పాక్ స్పందిస్తూ ఆప్ఘన్లు.. మొండివైఖరి, ఉదాసీనత ధోరణి చూపారని ఆరోపించింది. తదుపరి చర్చలు ఆప్ఘన్ సానుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ నిజంగా ఈ చర్చలు విఫలమైతే భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. ఎందుకంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, భారత్‌లో దాడులకు నిధులు సమకూర్చడం, శిక్షణ సహా ఇతర రకాలుగా పాక్ సైన్యం మద్దతు ఇస్తోందని న్యూఢిల్లీ నిరంతరం ఆరోపిస్తూ వస్తోంది.
భారత్, ఆప్ఘన్ సంబంధాలు
అక్టోబరు మొదటి వారంలో మొదటిసారి తాలిబన్ మంత్రి భారత్ పర్యటనకు విచ్చేశారు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆప్ఘన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్దరణకు మార్గం సుగమం అయ్యింది. విదేశాంగ మంతి అమిర్ ఖాన్ ముత్తఖీ నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల అనంతరం కాబూల్‌లోని టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి ఎంబసీగా మార్చాలని నిర్ణయించారు. అలాగే, పహల్గామ్‌లో ఉగ్రదాడిని ముత్తఖీ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.


