ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి మాటల దాడికి దిగారు. ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చల నేపథ్యంలో ఖవాజా రెచ్చిపోయారు. తమ ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయంటూ ఆప్ఘన్ తాలిబన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చర్చలు విఫలమైతే తాలిబాన్లతో యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య నేడు తుర్కియోలో చివరి దశలో కీలకమైన శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో టీవీతో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లతో చర్చలు విఫలమైతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. మాకు చాలా ఎంపికలు ఉన్నాయి. మమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. ప్రత్యక్షంగా మేము యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది. ఇలా జరగదని నేను కోరుకుంటున్నా. తాలిబాన్ ప్రభుత్వం సరిహద్దు దాడులను ఆపడానికి దృఢమైన చర్యలు తీసుకునే వరకు ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలు సాధారణ స్థితికి తిరిగి రావు. నేను మొత్తం ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని నిందించడం లేదు’ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఆండ్రాబీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సానుకూల ఫలితం కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొంటూనే ఉంటుంది అని ఆయన నొక్కిచెప్పారు. కానీ, ఆఫ్ఘనిస్థాన్ తన భూభాగం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంపై చర్చలు ఆధారపడి ఉంటాయని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి రౌండ్ చర్చలు అక్టోబర్ 18-19 తేదీలలో దోహాలో జరిగాయి. తరువాత అక్టోబర్ 25 నుండి ఇస్తాంబుల్‌లో రెండవ రౌండ్ చర్చలు జరిపారు. తాజాగా మరోసారి చర్చలు జరిపేందుకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే, కాబూల్ తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనే పాకిస్తాన్ డిమాండ్లపై ఆఫ్ఘనిస్థాన్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమవుతున్నాయి.


