ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన ఫైనల్లో పాక్ భారత్‌ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.
భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్‌తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్‌కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.
ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.
అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లో సమీర్ మిన్హాస్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ 347 పరుగులతో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. గత ఎడిషన్‌లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.


